తమను లైంగికంగా వేధిస్తున్నారంటూ రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ బ్రిజ్ భూషణ్ పై ఆరోపణలు చేసిన రెజ్లర్లకు, ఆయనకు మధ్య వివాదం కొత్త మలుపు తిరిగింది. తనకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చేసిన వారిపై తాను ఢిల్లీ హైకోర్టుకెక్కినట్టు వచ్చిన వార్తలను బ్రిజ్ భూషణ్ సోమవారం తోసిపుచ్చారు. వారి నిరసనలను గానీ , ఢిల్లీ ప్రభుత్వం లేదా కొన్ని న్యూస్ ఛానళ్ల ను గానీ సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్టు వచ్చిన ఈ వార్తలను ఆయన.ఖండించారు.
అసలు తానెవరికీ ఈ అధికారమివ్వలేదన్నారు. ‘విక్కీ అనే వ్యక్తి ఓ న్యూస్ ఛానల్ పై .. నా ఢిల్లీ నివాసాన్ని పేర్కొంటూ పిటిషన్ వేసినట్టు వార్త వచ్చింది.. అయితే దీన్ని ఖండిస్తున్నా.. నేనెవరికీ ఏ అడ్వొకేటుకు, లా ఏజన్సీకి లేదా ఎవరైనా ప్రతినిధికీ ఇలాంటి అధికారమివ్వలేదు’ అని ఆయన స్పష్టం చేశారు. .. నిరసనకు దిగిన ప్లేయర్లు, రెజ్లర్లపై ఢిల్లీ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలయిందని, బ్రిజ్ భూషణ్ ఇంట్లో కుక్ అయిన విక్కీ అనే వ్యక్తి ఆయన తరఫున దీన్ని వేశాడని వార్తలు వచ్చాయి.
పైగా విక్కీ అనే ఈ పిటిషనర్., బ్రిజ్ భూషణ్ నివాసంలో ఉంటాడని, అతడు కుక్ అని శ్రీకాంత్ ప్రసాద్ అనే లాయర్ తెలిపారు. ఇక- వినేష్ ఫొగత్, సాక్షి మాలిక్ వంటివారిపై ఎఫ్ ఐ ఆర్ పెట్టాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో దాఖలైన పిటిషన్ ను ఉపసంహరించుకున్నామని . . ఒత్తిడి కారణంగా తన క్లయింటు ఈ పిటిషన్ ను వెనక్కి తీసుకున్నారని శ్రీకాంత్ ప్రసాద్ చెప్పారు. ఓ వైపు తాను ఏ లాయర్ కీ ఎలాంటి అధికారమివ్వలేదని భూషణ్ చెబుతుండగా.. ఈ లాయర్ మాత్రం ఆయన తరఫున వాదిస్తున్నట్టు మాట్లాడారు. .
అయితే ఈ కేసుపై రానున్న వారాల్లో కోర్టు విచారించవచ్చునని కూడా సమాచారం. తనపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో బ్రిజ్ భూషణ్ తాత్కాలికంగా రెజ్లింగ్ ఫెడరేషన్ చీఫ్ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. రాజీనామా చేయాలని బలవంతం చేయడంతో బాటు తనను రెజ్లర్లు బ్లాక్ మెయిల్ చేశారని ఆరోపిస్తూ బ్రిజ్ భూషణ్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్టు మొదట వార్తలు వచ్చాయి. మీడియా మీద కూడా ఆయన ఈ పిటిషన్ లో ఆరోపణలు చేశారట.. చివరకు తానెలాంటి పిటిషన్ వేయలేదని ఆయన ప్రకటించడం విశేషం.