పంజాగుట్ట డ్రగ్స్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కేసులో ఇన్వాల్వ్ అయిన వ్యాపారుల కస్టడీ విషయంలో పోలీసులు వెనక్కి తగ్గడం లేదు. నాంపల్లి కోర్టు నిరాకరించినా హైకోర్టును ఆశ్రయించారు. వారం రోజుల కస్టడీకి అనుమతి కోరారు.
ఈ కేసులో కీలక సమాచారం రాబట్టాల్సి ఉందని అంటున్నారు పోలీసులు. డ్రగ్స్ కొనుగోళ్లకు సంబంధించిన అంశాలపై విచారిస్తామని కోర్టుకు తెలిపారు. వాదనలు విన్న తర్వాత తీర్పును మంగళవారానికి వాయిదా వేసింది న్యాయస్థానం.
ఇప్పటివరకు ఏడుగురు బడా వ్యాపారులు అరెస్ట్ అయ్యారు. వారంతా రిమాండ్ లో ఉన్నారు. ఇంకో నలుగురు వ్యాపారులు పరారీలో ఉండగా.. వారి కోసం గాలింపు కొనసాగుతోంది. రిమాండ్ లో ఉన్న ఏడుగురు వ్యాపారులను కస్టడీకి తీసుకుని విచారించాలని చూస్తున్నారు పోలీసులు.
వీరంతా టోనీ దగ్గర డ్రగ్స్ కొనుగోలు, విక్రయాలు చేస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. అటు టోనీ విచారణ మూడోరోజుకు చేరింది. కాల్ డేటా ఆధారంగా కూపీ లాగుతున్నారు పోలీసులు. ఫిబ్రవరి 2 వరకు అతడ్ని విచారించనున్నారు.