తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ టెట్ నిర్వహించాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డికి వినతిపత్రం అందజేశారు డీఎడ్, బీఎడ్ అభ్యర్థులు. అనంతరం వారు మాట్లాడుతూ.. కొత్తగా బీఎడ్, డీఎడ్ రెండో సంవత్సరం పూర్తి చేసిన వాళ్లు టెట్ పరీక్ష కోసం ఎదురు చూస్తున్నారన్నారు. దాదాపు 4 లక్షల మంది టెట్ పై ఆశలు పెట్టుకున్నామన్నారు. గతంలో నిర్వహించిన తెలంగాణ టెట్ కి ఇతరేతర కారణాల వల్ల కొందరు హాజరు కాలేకపోయారు. దాదాపు 2 లక్షల మంది విద్యార్థులు అర్హత సాధించలేకపోయారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2011లో టెట్ వేశారు. మళ్ళీ 2012లో డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చింది. తెలంగాణ రాష్టం వచ్చిన తరువాత 2016లో టెట్ జరిగింది. తరువాత 2017లో టెట్ పరీక్ష పెట్టి టీఆర్టీ నోటిఫికేషన్ ఇచ్చారు. తిరిగి 5 సంవత్సరాల తరువాత 2022 మర్చి 10న టెట్ నోటిఫికేషన్ ఇచ్చారు. జూన్ 12న పరీక్ష జరిగింది. పేపర్ 1 కి 3,18,44 మంది అప్లై చేసుకుంటే..కేవలం 32% మాత్రమే అర్హత సాధించారు.
అలాగే పేపర్ 2కి 2,50,897 మంది అప్లై చేసుకుంటే 49.5% మంది అర్హత సాధించారు. ఈ మధ్య వివిధ పత్రికలు మధ్యమాల ద్వారా గురుకుల, డీఎస్సీ లాంటి నోటిఫికేషన్లు ఇస్తారని తెలిసింది. గురుకుల, డీఎస్సీ నిర్వహించే ముందు మరొకసారి టెట్ నిర్వహిస్తే మా లాంటి టెట్ కోసం ఎదురుచూస్తున్న కొన్ని లక్షల మందికి న్యాయం జరుగుతుందన్నారు.
దయ చేసి మాకు కూడా గురుకుల, డీఎస్సీ రాసే అవకాశం కల్పించి మా జీవితాలకు మార్గదర్శకులుగా ఉంటారని, ఇప్పటికీ అయినా ప్రభుత్వం మా యందు దయ ఉంచి మళ్ళీ టెట్ నిర్వహించాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డికి డీఎడ్, బీఎడ్ అభ్యర్థులు విజ్ఞప్తి చేశారు.