తెలంగాణ రాష్ట్రం కంటే కర్ణాటక, మహారాష్ట్రాల్లో పెట్రోల్ ధర కాస్త తక్కువగా ఉంటుంది. అందులోనూ నారాయణఖేడ్ నియోజకవర్గం కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దులో ఉంది. దీంతో ఆ సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు పెట్రోల్ తక్కువ ధరకు దొరకడంతో కొంత మంది నయా దందాకు తెరలేపారు. ఇక కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న పెట్రోల్ బంకులు జనంతో కిటకిటలాడుతున్నాయి. అక్కడి నుండి వందల సంఖ్యలో వాహనాలు పెట్రోల్ ను తరలించి, రాత్రి పగలు తేడా లేకుండా అమ్ముతున్నారు.
రూ.10 తక్కువ ధరతో పెట్రోల్ అమ్మడంతో అనేక మంది కొనుగోలు చేస్తున్నారు. దీంతో ఈ దందా మూడు పువ్వులు, ఆరు కాయలు అన్న చందంగా సాగుతోంది. రోడ్డుపైనే దుకాణాల్లో దర్జాగా ఈ దందా సాగుతుండటం గమనార్హం. ఇంత జరుగుతున్నప్పటికీ కూడా అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. బీదర్ జిల్లా ఔ రాద్ తాలూకా చింతాకి కంగ్టికి 10 కిలో మీటర్ల దూరంలో ఉండటంతో అక్కడి నుండి తుఫాన్, ట్రాక్టర్, బొలెరా వాహనాల్లో తెచ్చి కంగ్టికి మండల కేంద్రంతో పాటు దేగులు వాడి, తడ్కల్, రాసోల్, కామారెడ్డి జిల్లా సరిహద్దు ఎంపల్లి వరకు ప్రతీ కిరాణ దుకాణం, హోటళ్లలో పెట్రోల్ అమ్మకాలు సాగుతున్నాయి.
అలాగే నాగలిగిద్ద మండలం మొర్గికి 4 కిలోమీటర్ల దూరంలో చిల్లర్గి, కరుసుగుత్తి నుంచి బడర్ తాండా పది కిలోమీటర్లలో వడగాం పెట్రోల్ పంపు ఉంది. నాగిలిగిద్ద మనూర్ మండలాల్లోని గ్రామాల ప్రజలు లీటరుకు రూ.10 చొప్పున తక్కువ ధరకు వినియోగదారులకు అమ్ముతున్నారు.
దీంతో వినియోగదారులు బైకులపై వెళ్లి ఫుల్ ట్యాంకు చేయించుకుని వస్తున్నారు. గతంలో ప్రైవేటు బస్సులు కూడా కర్ణాటక, మహారాష్ట్రాల నుంచి ఫుల్ ట్యాంక్ నింపుకొని వచ్చేవి. ఇప్పటికైనా అధికారులు స్పందించి బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్న పెట్రోల్ దుకాణాల యజమానులపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.