పెట్రోల్ బంక్‌ల యజమానులు అక్రమాలకు పాల్పడుతున్నారు. పెట్రోల్, డీజిల్‌లను కల్తీ చేస్తూ..నిలువుదోపిడీ చేస్తున్నారు. ఓ వైపు పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో సామాన్యుడు ఉక్కిరిబిక్కిరి అవుతుంటే..ఇది చాలదన్నట్టుగా బంకు యజమానులు కూడా జనం జేబుకు చిల్లులు పెడుతున్నారు.
మీటర్‌కి భిన్నంగా తక్కువ పెట్రోల్ కొడుతూ, మోసాలకు పాల్పడుతుండడం పెట్రోల్ బంకుల్లో తరచూ జరిగిన తంతే.. తాజాగా అంతకుమించిన షాకింగ్ ఘటన వెలుగుచూసింది.డీజిల్‌కి బదులు…ఏకంగా నీళ్లు వచ్చాయి. వివరాల్లోకి వెళ్తే..
సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో ఉన్న ఓ పెట్రోల్ బంక్‌కి ఒక వ్యక్తి పెట్రోల్ కొట్టించుకోవడానికి వెళ్లాడు. ఎదురుగా డీజిల్ కొట్టిస్తున్న సమయంలో..ఆ వ్యక్తికి అనుమానం వచ్చింది. సాధారణంగా పెట్రోల్ లేదా డీజిల్ కొట్టిస్తున్నప్పుడు.. ఆవిరి వస్తుంటుంది.
కానీ.. ఇక్కడ డీజిల్ కొడుతుంటే, అలాంటి ఆవిరి రాకపోవడాన్ని ఆ వ్యక్తి గమనించాడు. దీంతో అతడు ఓ తెలివైన పని చేశాడు. ఓ బాటిల్ తీసుకొచ్చి, అందులో డీజిల్ కొట్టాలని చెప్పాడు.
తొలుత ఆ బంక్ వాళ్లు ఒప్పుకోలేదు. ఇది చట్టవిరుద్ధమంటూ రూల్స్ మాట్లాడారు. కానీ.. ఆ వ్యక్తి మాత్రం వెనక్కు తగ్గకుండా బాటిల్‌లో డీజిల్ కొట్టమంటూ కొంచెం గట్టిగా మాట్లాడటంతో, ఆ పెట్రోల్ సిబ్బంది మరో దారి లేక బాటిల్‌లో కొట్టాడు.
దీంతో అసలు బాగోతం బయటపడింది. డీజిల్‌కి బదులు అందులో నుంచి నీళ్లు వచ్చాయి.ఇంకా విడ్డూరమైన విషయం ఏమిటంటే.. ‘ఇది డీజిలా?’ అని అడిగితే, సిబ్బంది అవునని సమాధానం ఇవ్వడం! రంగు మారిందే తప్ప, క్వాలిటీ కాదంటూ మాయమాటలు చెప్పేందుకు ప్రయత్నించాడు.
ఆల్రెడీ 70 బండ్లకు ఇదే డీజిల్ కొట్టానంటూ కుండబద్దలు కొట్టాడు. కానీ, జనాలు మరీ అంత తెలివితక్కువ వాళ్లు కాదు కదా! ఏది డీజిలో, ఏది నీళ్లో కనుక్కోకుండా ఉండటానికి! ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వాళ్లు రంగంలోకి దిగి, ఈ వ్యవహారంపై విచారిస్తున్నారు.