చమురు కంపెనీలు వాహన వినియోగదారుల వెంటపడ్డాయి. వరుసగా నాలుగో రోజూ వాతపెట్టాయి. తాజాగా పెట్రోల్, డీజిల్ పై లీటర్‌కు 29 పైసల వరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. దీంతో హైదరాబాద్‌లో లీటర్ పెట్రోలు ధర రూ. 91.65కు పెరగ్గా, డీజిల్ రూ.85.50గా ఉంది. దేశంలో అత్యధిక పెట్రో రేట్లు ఆర్థిక రాజధాని ముంబైలో ఉన్నాయి. అక్కడ పెట్రోల్ రూ. 94.64 పలుకుతుండగా, డీజిల్ రూ.85.32గా ఉంది.
ఈ ఏడాదిలో పెట్రోల్, డీజిల్ రేట్లు పెరగడం ఇది 16వ సారి. ఫిబ్రవరిలో ఆరోసారి. జనవరి 1 నుంచి కొద్ది కొద్దిగా వాతపెడుతున్న కంపెనీలు.. ఇప్పటిదాకా రూ. 4.50 పెంచాయి. ఈ పెంపు ఇలాగే కొనసాగితే మరో నెలరోజుల్లో సెంచరీ కొట్టడం ఖాయంగానే కనిపిస్తోంది.
పెట్రో ఉత్పత్తుల రేట్ల పెంపుపై ఇటీవలే పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వివరణ ఇచ్చారు. దేశ అవసరాలు తీరేందుకు ఇండియా 85 శాతం దిగుమతులపైనే ఆధారపడుతోందని చెప్పారు. మార్కెట్‌లో ముడిచమురు ధరలు పెరిగితే దేశంలో ధరలు పెంచాల్సి వస్తోందని సమాధానం ఇచ్చారు.