దేశంలో పెట్రోల్ ధరలు మరోసారి ఆదివారం పెరిగాయి. పెట్రోల్ పై లీటరుకు 50 పైసలు, డీజిల్ పై 55పైసలను చమురు కంపెనీలు పెంచాయి. దీంతో ఈ వారంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఇప్పటి వరకు రూ. 3.70, రూ 3.75 పైసల వరకు పెరిగాయి.
దీంతో దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 98.61 నుంచి రూ. 99.11లకు పెరిగింది. డీజిల్ ధర రూ. 89.87 నుంచి 90.42లకు చేరుకుంది. ఈ ధరలు నగరాలను బట్టి వేరువేరుగా ఉన్నాయి.
ఈ వారంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం ఇది ఐదో సారి కావడం గమనార్హం. అయితే గత నాలుగు రోజుల్లో వాటి ధరలను 70 నుంచి 80 పైసల వరకు పెంచారు. వీటితో పోలిస్తే ఆదివారం తక్కువగా 50 పైసలకు ధర పెరిగింది.
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నవంబర్ 4 నుంచి పెట్రోల్, డీజిల్ ధరలను పెంచలేదు. ఎన్నికల సమయంలో ఇలా ధరలు పెంచుకుండా ఉండటంతో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం, ఇతర కంపెనీలకు భారీగా నష్టాలు వచ్చినట్టు మూడీస్ ఇన్వెస్టర్ సర్వీసెస్ తెలిపింది.