పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ధరలకు సామాన్యులపై భారం పడుతోంది. దీంతో వాహనాలు నడపాలంటేనే బయపడిపోతున్నారు. పెట్రోల్, డీజిల్ పేరు వింటేనే కరోనా కంటే పెద్ద మహమ్మారి తయారైందని చెప్పుకుంటున్నారు. కాగా.. గత 16 రోజుల్లో 14 సార్లు ధరలు పెరగడంతో మరింత పిరం అయ్యాయి.
తాజాగా.. ఓ వివాహ వేడుకలో నూతన వధూవరులకు వారి స్నేహితులు లీటర్ పెట్రోల్, డీజిల్ బహుమతిగా ఇచ్చారు. పెట్రో ధరలు మండిపోతున్న వేళ వారిచ్చిన గిఫ్ట్ అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
తమిళనాడులోని చంగల్ పట్టు జిల్లా చెయ్యూరులో గిరీశ్ కుమార్, కీర్తన జంటకు వివాహం జరుగింది. వివాహ వేడుకలకు హాజరైన బంధువులు, స్నేహితులు వధూవరులను ఆశీర్వదిస్తున్నారు. ఇంకొందరు గిఫ్టులు అందించారు.
అదే సమయంలో పెళ్లి కొడుకు స్నేహితులు ఓ గిఫ్ట్ కవర్ ను ఇచ్చారు. అది చూసిన కొత్త జంట అవాక్కయ్యింది. పెట్రోల్, డీజిల్ తో ఉన్న రెండు లీటర్ బాటిళ్లను ఇద్దరి చేతిలో పెట్టి వారిని సర్‌ప్రైజ్ చేశారు. వారి చమత్కారానికి హాజరైన బంధువులంతా పగలబడి నవ్వారు. ఈ వీడియో చూసిన నెటిజన్ లు నైస్ గిఫ్ట్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.