మాటలు తడబడుతున్నాయి.. అస్త్రాలు తేలిపోతున్నాయి. పదాల్లో పస లేదు.. ప్రాస అసలే కనిపించడం లేదు. అన్నీ లాజిక్ లెస్.. ఇంకా చెప్పాలంటే బేస్‌లెస్.. ఫస్ట్ టైం టీఆర్ఎస్ ట్రబుల్ షూటర్ హరీష్ రావు.. ఉప ఎన్నికలు వ్యూహాలు సిల్లీగా అనిపిస్తున్నాయన్న మాటలు వినిపిస్తున్నాయి. ఆయన చేస్తున్న కామెంట్లు ఆ పార్టీ నేతలకే నవ్వును తెప్పిస్తున్నాయి. అసలు హరీష్ రావు హుజురాబాద్‌లో ఈటలను ఓడించాలనుకుంటున్నారా లేక గెలిపించాలనుకుంటున్నారా అన్న అనుమానాలు ఆపార్టీలోనే చాలా మందిలో కలుగుతున్నాయి.
గంగుల, కొప్పుల, బాల్క సుమన్‌లతో పని జరిగేట్టులేదని అర్థం కావడంతో.. గులాబీ బాస్ ఫైనల్లీ హుజురాబాద్ ఉప ఎన్నిక బాధ్యతను హరీష్ రావు భుజానికెత్తారు. తొలుత హరీష్ రావు, కేటీఆర్ హైదరాబాద్‌లోనే ఉండి అన్ని చూసుకుంటారని చెప్పిన కేసీఆర్ చివరకు.. తప్పని పరిస్థితుల్లో అల్లుడిని ఆపరేషన్‌కు పంపించారు. మామా ఆదేశాలతో సిద్దిపేట్ చేరిన హరీష్ రావు.. హుజురాబాద్ పక్కనే ఉండటంతో తన ఇంటి నుంచే ప్రస్తుతం తన ఆపరేషన్ చేస్తున్నారు. అవసరమైన నేతలని తన దగ్గరకే రప్పించుకుని ఉప ఎన్నిక వ్యూహాలను చర్చిస్తున్నారు. అయితే వారిని ఉత్సాహపరిచే క్రమంలో హరీష్‌రావు చేస్తున్న వ్యాఖ్యలను విని అక్కడికి వెళ్లిన వారు ఒకరి మొహం మరొకరు చూసుకుంటున్నారని తెలుస్తోంది.
హరీష్ రావు చేస్తున్న ప్రసంగాలు మరీ పేలవంగా ఉంటున్నాయని, ఆయన చెప్పే మాటలు తమకే నమ్మబుద్ధి కావడం లేదని వారంతా అనుకుంటున్నారు. ప్రత్యర్థులను ఇరుకున పెట్టేందుకు హరీష్ రావు గతంలో తెలివైన పాయింట్లను తెరపైకి తెచ్చేవారని, కేవలం తన లాజిక్‌లతోనే అవతలి వారిని దాదాపు ఓడించినంత పని చేసేవారని గుర్తుచేసుకుంటున్న వారు.. ఇప్పుడు ఆయన మాటలను వింటోంటే తామే నోరెళ్లబెట్టాల్సి వస్తోందని చెప్పుకుంటున్నారు. రెండు రోజులు క్రితం ఆయన చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ పెదవి విరుస్తున్నారు. హుజురాబాద్‌లో బీజేపీ గెలిస్తే పెట్రోల్, డీజిల్ ధర పెరుగుతాయని హరీష్ రావు చెప్పడం తమకే ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని.. అసలు ఆ మాట చెబితే జనం ఎవరైనా నమ్ముతారా అని విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
ఇక హుజురాబాద్‌లో బీజేపీ, కాంగ్రెస్ కలిసిపోయాయని ఆరోపించిన హరీష్ రావు.. దళిత ఓట్లను చీల్చేందుకు, బీజేపీని గెలిపించేందుకు కాంగ్రెస్ దళిత అభ్యర్థిని పోటీల పెడుతుందని చెప్పడం పట్ల గులాబీ శ్రేణులే షాక్ అవుతున్నాయి. హరీష్ రావు చెప్పిన ఆ మాట ఆరోపణలా అసలే లేదని, టీఆర్ఎస్‌ను ఓడించేందుకు చెప్పిన ప్లాన్‌లా ఉందని గుసగుసలాడుకుంటున్నారు. ఇక మెకాలి ఆపరేషన్‌తో ఈటల వీల్ చైర్ డ్రామాలు ఆడబోతున్నారని హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు చాలా ఎబ్బెట్టుగా ఉన్నాయని.. పైగా అవి ఎదురుతన్నుతున్న విషయన్ని వారు గుర్తు చేస్తున్నారు. గతంలో హరీష్ రావు పెట్రోల్ పోసుకున్నప్పుడు అగ్గిపెట్టే దొరకపోవడం డ్రామానేనా? కేసీఆర్ నిమ్స్‌లో దీక్ష చేయడం కూడా డ్రామానేనా? అని బీజేపీ లీడర్స్ ఎదురు ప్రశ్నిస్తోంటే.. తామే ఏం సమాధానం ఇవ్వలేకపోతున్నామని వారు చెప్పుకుంటున్నారు.
బీజేపీపై తీవ్ర వ్యతిరేకత ఉందని హుజురాబాద్‌లో మోదీ జెండాలు కనిపించకుండా, ఈటల తనవి మాత్రమే ఉండేలా జాగ్రత్తపడుతున్నారని హరీష్ ఆరోపించడం.. కూడా విచిత్రంగా ఉందని వారు విశ్లేషిస్తున్నారు. ఆయన చెప్పే మాటలు పరోక్షంగా మోదీ కంటే కూడా హుజురాబాద్‌లో ఈటలనే బలవంతుడు అని అన్నట్టుగా ఉందని అనుకుంటున్నారు. ఇలా హరీష్ రావు ప్రతి మాట తేడాగా ఉంటోందని.. ఈటలతో కలిసి నడిచిన ఆయనకు ఇరుకున పెట్టే మార్గం వేరే ఏదీ దొరక్కపోవడం పట్ల వారు ఆశ్చర్యపోతున్నారు. ఏదేమైనా హరీష్ రావు.. ఇంకా పదేళ్ల కిందటి ఉప ఎన్నికల వ్యూహాలనే అనుసరిస్తున్నారని.. తన పంథాను మార్చాల్సిన అవసరం కచ్చితంగా ఉందని గులాబీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి.