కేంద్ర పెట్రోలియం మంత్రి హర్ దీప్ సింగ్ పూరి గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. గతంలో పెట్రోల్ విక్రయాలపై ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు నష్టాలను చూశాయని ఆయన అన్నారు. కానీ ఇప్పుడు అంతర్జాతీయంగా ధరలు తగ్గాయన్నారు. దీంతో ఇప్పుడు కంపెనీలు లాభాలను చూస్తున్నాయన్నారు.
పెట్రోల్‌పై లాభాలు వస్తున్నాయని, కానీ డీజిల్ పై ఇంకా నష్టపోతూనే ఉన్నారని ఆయన చెప్పారు. మరోవైపు అంతర్జాతీయంగా ధరలు అదుపులో ఉన్నప్పుడు మాత్రమే పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని చమురు కంపెనీలకు ఆయన సూచించారు.
ఉక్రెయిన్, రష్యా యుద్ధం నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఇంధన ధరలు పెరిగాయి. ఈ క్రమంలో వినియోగదారులపై భారం పడకుండా చమురు కంపెనీలు చాలా బాధ్యతాయుతమైన కార్పొరేట్ పౌరులుగా వ్యవహరించాయన్నారు.
భారత్‌లో తమ ధరలను తగ్గించాలని చమురు కంపెనీలకు ఆయన ప్రత్యేకంగా అభ్యర్థించారు. వారణాసిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… గత 15 నెలలుగా పెట్రో ధరలను మార్చకుండా చమురు కంపెనీలు ప్రయత్నించాయన్నారు. కంపెనీల ప్రయత్నాన్ని ఆయన కొనియాడారు.
పెట్రోలు, డీజిల్ కంపెనీలు భారీగా నష్టపోతున్నప్పటికీ ధరలను మార్చడం లేదని వెల్లడించారు. నష్టాల నుంచి ఇప్పుడు రికవరీ అవుతున్న నేపథ్యంలో భారత వినియోగదారుల కోసం ధరలను తగ్గించాలని ఆయన కోరారు. అంతర్జాతీయ చమురు ధరలు అదుపులో ఉండి, తమ కంపెనీలు అండర్ రికవరీ ఆగిపోయినట్లయితే, భారత్‌లోనూ చమురు ధరలను తగ్గించాలని ఆయన అభ్యర్థించారు.
సుమారు ఏడాది నుంచి ధరలను పెట్రోలియం కంపెనీలు సవరించడం లేదన్నారు. ఈ నష్టాలు ముగియగానే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుముఖం పడుతాయని ఆయన పేర్కొన్నారు.