కరోనా వైరస్ కు చెక్ పెట్టేందుకు ఏకైక ఆయుధంగా కనపడుతున్నది వ్యాక్సిన్ ఒక్కటే. అందుకే వ్యాక్సిన్ కోసం ప్రపంచ దేశాలన్నీ ఎదురు చూస్తుండగా… అభివృద్ధి చెందిన కొన్ని దేశాలకు మాత్రం ఫైజర్ కంపెనీ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేసింది.
కానీ ఫైజర్ వ్యాక్సిన్ వేసుకున్న వారం తర్వాత కూడా ఓ నర్సు వైరస్ బారిన పడటం కలకలం రేపుతోంది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఫేస్ బుక్ ద్వారా వెల్లడించారు. అమెరికాలోని క్యాలిఫోర్నియా రాష్ట్రానికి చెందిన మాథ్యూస్ స్థానికంగా ఉన్న రెండు ఆస్పత్రుల్లో నర్సుగా విధులు నిర్వహిస్తున్నారు. డిసెంబర్ 18న ఆయన ఫైజర్ కంపెనీ తయారు చేసిన కరోనా టీకా తొలి డోసును తీసుకున్నారు. చేతిపై టీకా వేయించుకున్న ప్రాంతం కొద్దిగా ఎర్రబడటం తప్ప తనకు ఇతర ఇబ్బందులూ కలగలేదని తెలిపారు.
వ్యాక్సిన్ వేసుకున్న ఆరు రోజుల తరువాత అంటే క్రిస్మస్ సందర్భగా విధుల్లో ఉన్న తనకు అనారోగ్యంగా అనిపించిందని, ఆ తరువాత కొద్ది సేపటికే చలి, ఒళ్లునొప్పులు వచ్చాయని తెలిపారు. మరుసటి రోజు కరోనా టెస్టు చేయించుకోగా రిపోర్టుల్లో పాజిటివ్ అని తేలింది.
అయితే, ఇందులో ఇబ్బందేమీ లేదంటున్నారు వైద్య నిపుణులు. టీకా తీసుకున్న 10-14 రోజుల తర్వాత కానీ మన రోగనిరోధక వ్యవస్థ కరోనాను ఎదుర్కొనేందుకు ఇమ్యునిటీని తయారు చేసుకోలేదంటున్నారు. ఫస్ట్ డోస్ తర్వాత ఇమ్మునిటీ 50 శాతం సామర్థ్యాన్ని, రెండు డోసు తరువాత 95 శాతం శక్తిని తయారు చేసుకుంటుందని వివరిస్తున్నారు.