మెడికో ప్రీతిది ఆత్మహత్యా? లేదా హత్య అనే విషయంపై మిస్టరీ వీడలేదు. హైదరాబాద్ ఫోరెన్సిక్ డిపార్ట్ మెంట్ నుంచి వరంగల్ జిల్లా మట్టెవాడ పోలీసులకు ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు అందింది. ఈ రిపోర్టు ఆధారంగా ప్రీతిది ఆత్మహత్యా? హత్యా? దానిపై పోలీసులు నిర్ధారణకు వచ్చే అవకాశం ఉంది. ప్రీతి డెత్ కేసులో కప్టడీలో ఉన్న నిందితుడు సైఫ్ ను పోలీసులు నాలుగో రోజు ప్రశ్నిస్తున్నారు.
సైఫ్ ను అతను చెబుతున్న వివరాల ఆధారంగా మరికొంత మందిని ప్రశ్నిస్తుండే సరికి ప్రీతి డెత్ కేసులో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. పీఏసీ రిపోర్టు వివాదంలో డా.స్మృతి అభిప్రాయం ఇందులో కీలకంగా మారింది. డా.స్మృతితోపాటు మరో ముగ్గురిని ప్రశ్నించిన పోలీసులు పీఏసీ రిపోర్టు వివాదానికి కారణాలను తెలుసుకున్నారు. సైఫ్ వేధింపులపై ఫిర్యాదు చేశాక..ఎంజీఎం హెచ్ వోడీ కౌన్సిలింగ్ చేస్తుండగా ప్రీతి కన్నీరు పెట్టినట్లు పోలీసులతో చెప్పారు.
ఎల్ డీడీ-నాకౌట్స్ గ్రూపులో తనన సపోర్టు చేయాలని మెడికోలను ప్రీతి వేడుకున్నట్లు గుర్తించారు. అటు ప్రీతి లాస్ట్ కాల్ పై పూర్తిస్థాయి సమాచారాన్ని దర్యాప్తు బృందం సేకరిస్తోంది. సోదరి పెళ్లికి ప్రీతి సెలవు పెట్టినా అబ్సెంట్ వేయడంపై ఫోకస్ పెట్టారు. సాంకేతిక, శాస్త్రీయ ఆధారాలను సరిపోల్చుతూ సీపీ రంగనాథ్ విచారణను పర్యవేక్షిస్తున్నారు. డేటా అనలిస్టులు, ఫోరెన్సిక్ టీమ్, విచారణ బృందం ఇన్ పుట్స్ ను సీపీ రంగనాథ్ పరిశీలిస్తున్నారు. ఎఫ్ ఎస్ఎల్, టాక్సికాలజీ రిపోర్టులను పోలీసులు కోర్టుకు సమర్పించారు.
ఈ కేసులో ఇప్పటికే నిందితుడు సైఫ్ ను పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. నాలుగో రోజు అతడిని విచారిస్తున్నారు. సైఫ్ నుంచి అనేక వివరాలు రాబడుతున్నారు. శనివారం(మార్చి4,2023) సాయంత్రం డాక్టర్ ప్రీతి ఘటనపై పోలీసులకు ఎఫ్ఎస్ఎల్ నివేదిక అందింది. అందులోని సారాంశం గురించి పోలీసులకు బ్రీఫ్ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రీతి కేసులో ఎఫ్ఎస్ఎల్ నివేదిక కీలకంగా మారనుంది. ఎఫ్ఎస్ఎల్ నివేదికలో ఏముంది? అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో పీజీ అనస్థీషియా ఫస్టియర్ చదువుతున్న ప్రీతి ఫిబ్రవరి 22న హానికారక ఇంజెక్షన్ తీసుకోవడం ద్వారా ఆత్మహత్యకు యత్నించింది. మొదట ఆమెకు వరంగల్ ఎంజీఎంలో చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ నిమ్స్‌కు తరలించారు. ఆమెను బతికించేందుకు ప్రత్యేక వైద్య బృందం తీవ్రంగా ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం లేకపోయింది.
హైదరాబాద్ నిమ్స్‌లో ప్రీతి ఐదు రోజుల పాటు మృత్యువుతో పోరాడారు. వెంటిలేటర్, ఎక్మోపై చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఆదివారం (ఫిబ్రవరి 26) రాత్రి 9.16 గంటలకు ప్రీతి చనిపోయినట్టు వైద్యులు ప్రకటించారు. సెకండ్ ఇయర్ విద్యార్థి సైఫ్ తనను వేధిస్తున్నాడంటూ ప్రీతి ఫిబ్రవరి 18న తల్లిదండ్రులకు చెప్పారు. ప్రీతి ఆత్మహత్యయత్నం చేసుకున్న రోజు రాత్రి విధుల్లో ఉన్నారు. తెల్లవారుజామున 3 గంటల వరకు డ్యూటీ చేశారు.
ప్రీతికి న్యాయం జరగాలి: మందకృష్ణ మాదిగ!
వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో సీనియర్ల ర్యాగింగ్ భరించలేక ప్రీతి అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. తాజాగా.. ఈ ఘటనపై ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ స్పందించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఎదుట పలు కీలక డిమాండ్లు పెట్టారు. ప్రీతి మృతి కేసుపై ప్రభుత్వం వివక్ష చూపుతోందని మండిపడ్డారు. రంగారెడ్డి జిల్లాలో దిశకి జరిగిన న్యాయమే ప్రీతికి జరగాలని డిమాండ్ చేశారు. ప్రీతి మరణంపై ఎన్నో అనుమానాలు ఉన్నాయని, ప్రీతి ఆత్మహత్య చేసుకునే అంత పిరికిది కాదని మందకృష్ణ తెలిపారు.
ప్రీతి మృతి కేసును హత్య కేసుగా మార్చాలని, వెంటనే జ్యూడీషీయరీ విచారణ జరపాలని మందకృష్ణ మాదిగ ప్రభుత్వాన్ని కోరారు. లేకపోతే న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు.