– పోరాడి ఓడిన ప్రీతి
– ఆస్పత్రిలో ఆగిన గుండె
– సైకో సైఫ్ చేతిలో బలైన అభాగ్యురాలు
– ఆత్మహత్యగా భావిస్తున్న ఖాకీలు
– ఇది హత్యేనంటున్న బాధిత కుటుంబం
– సైఫ్ తోపాటు హెచ్ఓడీ తీరుపైనా అనుమానం
– సిట్టింగ్ జడ్జితో విచారణకు..
– డాక్టర్స్ అసోసియేషన్ డిమాండ్
డాక్టర్ కావాలనుకుంది. ఎన్నో కలలు కన్నది. ఉన్నత శిఖరాలు అధిరోహించి తల్లిదండ్రులను బాగా చూసుకోవాలని భావించింది. కానీ, ఆమె కలలపై సైఫ్ అనే సైకో నీళ్లు చల్లేశాడు. ఆమె ఆశలను తన సీనియారిటీ అనే మదంతో తొక్కేశాడు. పోలీసుల విచారణలో ఆత్మహత్యగా అనుకుంటున్నారు. కానీ, అదంతా కట్టుకథగా బాధిత కుటుంబం చెబుతోంది. ఇది ముమ్మాటికీ హత్యేనని అంటోంది.
వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో అనస్థీషియా విభాగంలో ఫస్ట్ ఇయర్ చదువుతోంది విద్యార్ధిని ప్రీతి. గతేడాది నవంబర్ నుంచి సీనియర్ విద్యార్థి సైఫ్ వేధిస్తున్నాడు. సడెన్ గా బుధవారం ఉదయం అపస్మారక స్థితిలో కనిపించింది. సైఫ్ బాధ తట్టుకోలేక హానికరమైన ఇంజెక్షన్ తీసుకుందని ప్రచారం మొదలైంది. వెంటనే ఆమెను ఎమర్జెన్సీ వార్డులో చేర్పించి సీపీఆర్ చేసారు. పరిస్థితి క్రిటికల్ గా మారడంతో వెంటనే హైదరాబాద్ నిమ్స్ లో చేర్పించారు.
నాలుగు రోజులు పోరాటం తర్వాత ప్రీతి చనిపోయిందని నిమ్స్ డాక్టర్లు ప్రకటన చేశారు. సరిగ్గా ఆదివారం రాత్రి 9.10 గంటలకు చనిపోయినట్లు తెలిపారు. బ్రెయిన్ డెడ్ తో మృతి చెందినట్లుగా నిర్ధారించారు. ప్రీతి మరణాన్ని ముందుగానే అంచనా వేశారు తల్లిదండ్రులు. ఈ మేరకు వారికి కౌన్సెలింగ్ కూడా ఇచ్చారు డాక్టర్లు. ప్రీతి బతికే అవకాశం లేదని బ్రెయిన్ డెడ్ అయినట్టు చెప్పారు. ఈ క్రమంలోనే ఆమె తండ్రి నరేంద్ర కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రీతీది ముమ్మాటికీ హత్యేనని అన్నారు.
ర్యాగింగ్ ఇష్యూను హెచ్ఓడీ సరిగ్గా హ్యాండిల్ చేయలేదన్న ఆయన.. ప్రీతి జోలికి సైఫ్ రాకుండా ఆపలేకపోయారని ఆరోపించారు. సైఫ్ ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. వైద్యుల ట్రీట్ మెంట్ పైనా అనుమానం వ్యక్తం చేశారు. అడ్మిట్ అయిన రోజు నుంచి ఇప్పటిదాకా ఒకే రకంగా ఆరోగ్య పరిస్థితి ఉందని వాపోయారు. శనివారం వరకు కొంత ఆశ ఉండేదని.. బ్రెయిన్ డెడ్ అయిందని డాక్టర్లు చెప్పగానే ఆశలు వదిలేసుకున్నామని అన్నారు. ప్రీతి తండ్రి వ్యాఖ్యల తర్వాత ఆస్పత్రి దగ్గర భారీ బందోబస్తును ఉంచారు. దీంతో ఆమె మరణించి ఉంటుందని అంతా అనుకున్నారు. అనుకున్నట్టే 9.10 గంటలకు చనిపోయినట్టు వైద్యులు ప్రకటించారు. మరోవైపు నిందితుడు సైఫ్ రిమాండ్ లో ఉన్నాడు.