– సింపుల్ గా రూట్ సొసైటీకి లైన్ క్లియర్
– 80 కోట్లకు కొని- 200 కోట్లకు అమ్మకం
– అమ్మ నా.. గోపికృష్ణ అనేలా ఫిక్సింగ్
– భావితరాల విద్యార్దులకు పంగనామాలు
– సదాశయానికి..తూట్లు పొడిచిన ఫినిక్స్
– కోట్ల ఇచ్చిన భూమిపై..వందల కోట్ల బిజినెస్
– అమ్మకమే అక్రమం అంటే…
– బోనస్ గా పక్కనే ప్రభుత్వభూమికి ఎసరు
– ఫినిక్స్ భూ ఫిక్సింగ్ పార్ట్-13
– తొలివెలుగు క్రైంబ్యూరో ఎక్స్ క్లూజివ్ కథనం
హైదరాబాద్ లో భారీ ఎత్తున భూమి కొనాలా..?అమ్మాలా..? అది సర్కారీ ల్యాండా..! వివాదాల్లో ఉందా..? కోట్ల ఖరీదైన సర్కారీ భూమి చవకగా కావాలా..? అసైన్డ్ ల్యాండ్స్ అప్పనంగా దోచి ఇవ్వాలా..? ఇలాంటివి ఏవి ఉన్నా.. సరసమైన ధరలకే దోచి..దోచుకుని ఇవ్వబడును. సంప్రదించండి.. ఫినిక్స్. కబ్జాలు..భూకుంభకోణాల్లో స్పెషలిస్ట్. మరి ప్రభుత్వం ఏమనదా..అంటే..అసలు సర్కారేదైనా వాళ్లతో కలిసికట్టుగా పనిచేయటమే కదా..ఫినిక్స్ ప్రత్యేకత.
విచిత్రం ఏంటంటే..రాష్ట్రంలో ఏ మూలనో ఎవరో..ఏదో అవసరం ఉందని అసైన్డ్ భూములను కొనుగోలు చేస్తే గగ్గోలు పెట్టే టీఆర్ఎస్ సర్కార్..ఫినిక్స్ ఎన్నిదందాలు చేసినా.. పిల్లి కళ్లు మూసుకొని పాలు తాగుతున్నట్లే నటిస్తుంది. తొలివెలుగు క్రైం బ్యూరో కళ్లకు కట్టినట్లు ఫినిక్స్ భూ అరాచకాలను ప్రజల ముందు ఉంచినా..అసలేమీ పట్టనట్లు నటిస్తోంది. సినిమాభివృద్ది కోసం కేటాయించిన పద్మాలయ స్టూడియో భూములైనా,ఇనాం దారుల ధరణి అయినా..సీలింగ్ యాక్ట్ మిగులు భూములు అయినా.. పైగా ల్యాండ్స్, చివరికి ఒకప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల నిండు కుండలా ఉండే చెరువులైనా..ఫినిక్స్ ఇండియా కంపనీ గత 8ఏళ్లలో గుట్టు చప్పుడు కాకుండా స్వాహా చేసేసింది. తవ్విన కొద్దీ గుట్టలు గుట్టలుగా వారి బాగోతాలు బయటపడుతున్నాయి.ఇప్పటికే డజన్ కు పైగా కథనాలు తొలివెలుగు మీ ముందుంచింది. తాజాగా ఫినిక్స్ మరో భూబాగోతం ..మీకోసం.
రూట్ ఎడ్యుకేషనల్ సొసైటీ
బంజారాహిల్స్ లో తక్కువ డబ్బులకు మంచి విద్యను అందిస్తున్నలీలా అగర్వాల్ కి చెందిన రూట్ ఎడ్యుకేషనల్ సొసైటీకి కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి ప్రభుత్వం షేక్ పేట్ సర్వే నెంబర్ 403 లో 2 ఎకరాలు కేటాయించింది.డాక్యుమెంట్ నెంబర్ 2021/1996. గజానికి రెండు వందల చొప్పున 5 సంవత్సరాల పాటు దఫాల వారీగా వాయిదాలు చెల్లించాలని అప్పటి కలెక్టర్ ఆర్.సుబ్రహ్మణ్యం ద్వారా ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చేయించి ఇచ్చింది. G.O. Ms.No. 199 Rev. (Assian-III ) Dated: 23-2-1994 ప్రకారం అమ్మకం జరిగింది.
తల్లీ లీల ఆశయాన్ని అడియాసలు చేసిన కొడుకు అమిత్ అగర్వాల్
దేశ భవిష్యత్ పాఠశాలలోనే..విద్యార్థులకు మంచి విద్య అందించటంలోనే ఉంటుందని అనుకున్న ఆ తల్లి లీలా అగర్వాల్ ఆశయం..కోట్ల నోట్ల కట్టల ముందు చిన్నబోయింది.ఆ భూమిని కేవలం స్కూల్, హాస్టల్, టీచర్స్ క్వార్టర్స్ కోసమే నిర్మిస్తామని ప్రభుత్వానికి అగ్రిమెంట్ రాసి ఇచ్చింది. తల్లిలాగా పిల్లలు ఆలోచించడం లేదు. ప్రభుత్వం వద్ద మేము నామినల్ ధర చెల్లించి తీసుకున్నాము కాబట్టి మా ఇష్టం ఉన్న రేట్ కి అమ్ముకుంటామని కమర్షియల్ గా తయారయ్యారు. అందుకు పేరు ప్రఖ్యాతలు ఉన్న స్కూల్ ని ఎలా పాడు చేయాలి? విద్యార్ధులను స్కూల్ నుంచి వెళ్లకొట్టేందుకు ఏం చేయాలి అని ఆలోచించారు. అయితే, కరోనా వీరికి కలిసి రావడంలో.. మహమ్మారి పేరు చెప్పి ఫినిక్స్ కి చెందిన గోపికృష్ణ పని పూర్తి చేశారు.
ఏడాదిలో 80 కోట్లు 200 కోట్లయింది
ఫినిక్స్ ఎంటర్ అయితే చాలు.. ఆ భూమి రేట్ అమాంతం పెరిగిపోతుంది. ఇప్పటికే చాలా లిటిగేషన్ భూములను చేత బట్టి సుమారు లక్ష కోట్ల బిజినెస్ చేస్తోంది. అన్నీతాము చేయలేమని అనుకున్న ఫినిక్స్.. బేరసారాలు మొదలు పెట్టింది. 80కి కొనుగోలు చేసేందుకు అగ్రిమెంట్ చేసుకుని.. అది పూర్తి కాకముందే ప్రభుత్వం దగ్గర నుంచి అన్నీ అధికారికంగా తెప్పించి.. 200 కోట్లకు ఓ రెడ్డి బిజినెస్ మ్యాన్ కి అమ్మకం జరుపుతోంది. అదనంగా మరో వెయ్యి గజాల ప్రభుత్వ భూమిని కొట్టేసేందుకు ప్లాన్ వేసింది. ఇదే విషయం జీహెచ్ఎంసీ అధికారులకు తెలియడంతో వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని నోటీసులు జారీచేసింది విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్. అయితే, నోటీసులు ఇచ్చినంత ఫాస్ట్ గా వారి బాగోతాన్ని బట్టబయలు చేస్తుందా.. అనే అనుమానాలు ఉన్నాయి.
అమ్మనా.. గోపి..
ఫినిక్స్ లో అధికారాలు చుక్కపల్లి సురేష్.. గోపీకృష్ణకి అప్పగించినప్పటి నుంచి వివాదస్పద భూములు మూడు పువ్వులు పదహారు కాయలుగా కొనసాగుతోంది. అందుకు బోగి శ్రీధర్ రావు నుంచి మొదలుకుని పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న సిస్టర్ కంపనీల వ్యవహారం చూస్తే.. గోపీకృష్ణ వ్యవహార శైలిపై ఎన్నో అనుమానాలకు తావిస్తున్నాయని కొంత మంది అనుమతులు ఇచ్చే అధికారులే అవాక్కవుతున్నారు.
ఇక ఫినిక్స్ భూ ఫిక్సింగ్ లో ..మరిన్ని భూలీలలు 14 వ పార్ట్ లో చూద్దాం.