– కర్నాటకలో బ్లాక్ లిస్ట్ లో పెట్టారు
– కేరళలో సీబీఐ కేసు పెట్టారు
– అయినా కూడా పేరు మార్చి దందా
– తెలంగాణలో రూ.63 కోట్ల స్కాం
– వ్యవసాయ రంగం అడ్డాగా దోపిడీ
– బుట్టల పేరుతో కనికట్టు
– దొంగల ముఠానే నమ్ముతున్న కేసీఆర్ గ్యాంగ్!
క్రైం బ్యూరో, తొలివెలుగు:గులాబీ పాలనలో స్కాములకు కొదవే లేదు. రోజూ ఏదో ఒక వ్యవహారం ఎక్కడో ఒక చోట బయటపడుతూనే ఉంటుంది. ఆ నాయకుడు కబ్జా చేశాడని ఒకరు.. ఈ నాయకుడు ఇంత తింటున్నాడని మరొకరు.. ఆధారాలతో సహా బయటపెడుతూనే ఉన్నారు బాధితులు. కానీ.. వారిపై ఎలాంటి యాక్షన్ ఉండదనుకోండి. అది వేరే విషయం. అయితే.. రైతు సంక్షేమమే తమ లక్ష్యమని ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రం మెడలు వంచుతామంటోది టీఆర్‌ఎస్ సర్కార్. కానీ.. ఆ రైతుల్నే ముంచేసిన స్కాం ఒకటి తొలివెలుగు మీ ముందుకు తెస్తోంది.
ముకుంద్ మహేశ్వరి.. అన్నం పెట్టే రైతన్నలకు సున్నం పెట్టడంలో ఈయనను మించినవారే లేరేమో. కర్నాటక, కేరళ, తెలుగు రాష్ట్రాల్లోని ఏ వ్యవసాయశాఖ అధికారిని అడిగినా ఈయన గురించి చెప్పేస్తారు. నాగార్జున ఆగ్రో కెమికల్ ప్రయివేట్ లిమిటెడ్ పేరుతో 2001న కంపెనీని ప్రారంభించాడు. 2015లో కర్నాటక ప్రభుత్వం ఆ కంపెనీని బ్లాక్ లిస్ట్ లో పెట్టింది. దానికి అనేక కారణాలు ఉన్నాయి. అగ్రిమెంట్ ప్రకారం కాకుండా ఇష్టం వచ్చినట్లు వ్యవహరించడంతో రైతుల దగ్గరే దందా చేస్తావా అంటూ 2014లో ఇచ్చిన ఆర్డర్స్ అన్నింటినీ క్యాన్సిల్ చేస్తూ బ్లాక్ లిస్టులో పెట్టింది. 2016లో కేరళ ప్రభుత్వం ఏకంగా సీబీఐ కేసు నమోదు చేసింది. క్రైం నెంబర్ ఆర్సీ 13 ఏ/2016/సీబీఐ కొచ్చిన్. జిప్సం కొనుగోళ్లలో నిధుల దుర్వినియోగానికి పాల్పడినందుకు ముకుంద్ ను అరెస్ట్ చేసింది సీబీఐ. ఇక హైదరాబాద్ కేంద్రంగా కూడా అనేక వ్యవహారాలు నడిపించారనే ఆరోపణలు ఉన్నాయి.
కియా బయోటెక్ తో వ్యవహారాలు..!
కర్నాటక, కేరళలో ఎదురైన దెబ్బలకు ఇక్కడ టెండర్స్ వేయాలంటే నాగార్జున ఆగ్రోకి చుక్కలు కనపడ్డాయి. అధికారులు ఈ పేరు చెప్పగానే వెనక్కి తగ్గేవారు. గత చరిత్రను వెలిక్కి తీసి టెండర్లు అపివేశారు. దీంతో కేవలం ఓ ఫర్మ్ ఏర్పాటు చేసుకుని టెండర్లలో పాల్గోంది. కోట్లాది రూపాయల పనులకు ప్రయివేట్ లిమిటెడ్ కంపెనీ కాకుండానే తెలంగాణ స్టేట్ కో ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్ టెండర్లు దక్కించుకుంది. ఇందుకు అగ్రికల్చర్ అధికారులకు బాగానే ముడుపులు ముట్టినట్లు సమాచారం.
నకిలీ డెలివరీ చలాన్లతో నిలువు దొపిడీ
పంటకు గులాబీ చీడ నుంచి బయటపడేందుకు లింగార్షక బుట్టలను వాడతారు రైతులు. ఈ విషయంలోనే ముకుంద్ మహేశ్వరి బుట్టలో గులాబీ సర్కార్ పడింది. పాలనలో పట్టులేకపోవడంతో అవినీతిని అందలం ఎక్కించడంతో ఆ మాయల మరాఠీకి ఈజీగా స్కాం చేసేందుకు అవకాశాలు దక్కాయి. చివరకు కోర్టు కేసులు వేసిన పరిస్థితి. రూ.63 కోట్ల స్కాంపై విజిలెన్స్ అధికారులు నివేదిక అందించినా.. దానికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవడం లేదు ప్రభుత్వం.
స్కాం జరిగింది ఇలా..!
పత్తి పంటను గులాబీ రంగు పురుగు నుంచి రక్షించేందుకు లింగార్షక బుట్టలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచించింది. అయితే.. రైతులకు ఇవ్వకుండానే ఇచ్చినట్లు 63 కోట్ల రూపాయల స్కాంకి తెరలేపారు. కానీ.. విజిలెన్స్ అధికారుల అప్రమత్తతో కొంతవరకు అడ్డుకట్ట పడింది. 8 బుట్టలను ఒక్క యూనిట్ గా చేర్చి.. ఒక్కో యూనిట్ కి 376 రూపాయలు.. ఇచ్చేలా కియా బయోటెక్ తో ఒప్పందం కుదిరింది. 16 లక్షల 76 వేల యూనిట్స్ కు 63 కోట్ల రూపాయలతో నియమనిబంధనలు లేకుండానే టెండర్స్ లోనే అక్రమాలకు తెరలేపారు. దీనికి తోడు ఓ ఐఏఏస్, రాజకీయ నాయకుల అండతో.. రంగారెడ్డి, సంగారెడ్డి, అదిలాబాద్, భూపాలపల్లి, జనగామ, నల్లగొండ జిల్లాల్లో 2019లో రైతులకు అప్పగించినట్లు ఫోర్జరీ సంతకాలతో బిల్లులు ఎత్తేశారు. అయితే.. విజిలెన్స్ కి ఫిర్యాదులు రావడంతో ప్రాథమిక దర్యాప్తు జరిపి కొన్ని జిల్లాలకు రిలీజ్ కావాల్సిన 8 కోట్ల రూపాయల బిల్లులను అపగలిగారు. దీంతో ఈ స్కాంలో పాల్గోన్న అధికారులకు నోటీసులు జారీ అయ్యాయి. కానీ.. ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు రావడం లేదు. దీనికి తోడుగా కియా బయోటెక్ బిల్లుల కోసం హైకోర్టులో కేసులు వేసినట్లు సమాచారం.
ఇప్పుడేం చేయాలి?
అసలు.. టెండర్స్ పక్రియలో జరిగిన అక్రమాలు ఏంటో బయటకు రావాలి..? పలు రాష్ట్రాలు బ్లాక్ లిస్ట్ లో పెట్టిన నాగార్జున ఆగ్రో కెమికల్ కంపెనీ.. కియా పేరుతో మరో దందాకు తెరలేపినా గుర్తించకపోవడం వెనుక ఎవరున్నారు? సీబీఐ కేసుల్లో ఉండి అన్నం పేట్టే రైతన్నకు నష్టం వాటిల్లేలా వ్యవహరించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. ఇలా అనేక డిమాండ్లు రైతు సంఘాల నుంచి వినిపిస్తున్నాయి. కేసీఆర్ రైతుల కోసం ఏంతో చేశామని చెప్పడం కాదు.. ఇలాంటి వారికి స్థానం లేకుండా చేయాల్సిన అవసరం ఉందని చెబుతున్నాయి.
ప్రభుత్వంలో స్కాంలు జరగడం లేదని టీఆర్ఎస్ నాయకులు చెబుతున్నారు. అయితే.. అడ్వటైజింగ్ బోర్డులపై గ్రామీణ శాఖ ప్రచార అర్భాటం స్కాం ఎలా ఉందో తొలివెలుగు క్రైం బ్యూరో తర్వాతి కథనంలో అందిస్తుంది.