పంజాగుట్ట స్మశాన వాటికనూ వదల్లే!
మహాప్రస్థానం సీన్ రిపీట్
పిచ్చి పీక్స్..దళితుల బతుకులతో గేమ్స్
కాటికాపర్లను మింగేస్తున్న వైనం
6 కోట్ల పరిహారం ఎవరికి ఇచ్చారో?
తొలి వెలుగు క్రైమ్ బ్యూరో సంచలనం!
క్రైంబ్యూరో, తొలివెలుగు: ఫినిక్స్ పిచ్చి పీక్స్ కి చేరిందంటున్నారు కాటికాపర్లు. సీఎస్ఆర్ ఫండ్స్ తో స్మశాన వాటికలను అభివృద్ధి చేస్తున్నామంటూ.. తమ పొట్టకొట్టి కోట్లాది రూపాయలు దోచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లాభమే ఆశించకుండా ఉంటే.. అభివృద్ది చేయాల్సిన స్మశానవాటికలు చాలా ఉన్నాయి.. అక్కడ చేసుకోవాలి. కానీ, డిమాండ్ ఉన్న స్మశాన వాటికలను తీసుకొని మెడికల్ మాఫియాతో చేతులు కలిపి కార్పొరేట్ బిజినెస్ చేస్తున్నారని దళితులైన కాటికాపరులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. మహాప్రస్థానంలో కాటికాపర్లకు పట్టిన గతే తమకు పడుతుందేమోనని 18 కుటుంబాలు బిక్కుబిక్కుమంటు బతుకుతున్నాయి.
ఘన కీర్తి ఉన్నపంజాగుట్ట స్మశాన వాటిక
పంజాగుట్టలో ఉన్నహిందు స్మశాన వాటికకు ఘన చరిత్ర ఉంది. పదెకరాల చెరువు.. 52 ఎకరాల విస్తీర్ణంలో ఏనుగులు వచ్చినీళ్లు తాగి సేద తీరే ప్రాంతం కావడంతో ఎనుగుల గడ్డ అనేవారు. సువిశాలమైన ప్రాంతంగా ఉండేది. రోడ్ల విస్తరణతో పూర్తిగా కుచించుకుపోయింది. కొంత భూమిని పార్క్ గా, మరికొంత భూమిని ముస్లిం కుటుంబాలకు, దోబిఘాట్ కి కేటాయించారు. కబ్జాకోరల్లో 15 ఎకరాలు చిక్కుకుంది. ఇప్పుడు 10 ఎకరాలు కూడా కనిపించదు. ఎంతోమంది గొప్ప లీడర్లు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను తన కడుపులో దాచుకుంది. ఇప్పుడున్న కాటికాపరులు పేదవారికి ప్రీగా సర్వీస్ చేస్తారు.ఇలా తాతల నుంచి వందేళ్లుగా పంజగుట్ట స్మశాన వాటిక ఆధారంగానే జీవనం కొనసాగిస్తున్నారు.
కోట్ల స్కాంలు చేసిన స్మశాన వాటిక పరిరక్షణ సమితి
స్మశాన వాటిక డెవలెప్ మెంట్ కోసం చుట్టు ఉన్న 20 బస్తీల పెద్దమనుషులు పరిరక్షణ సమితి పేరిట ఓ కమిటీ ఏర్పాటు చేసుకున్నారు. రాజకీయ అండదండలతో రోడ్డు సైడ్ హోర్డింగ్స్ ద్వారా పెద్ద మొత్తంలో ఆదాయం రాబట్టారు. కానీ.. అభివృద్ది మాత్రం శూన్యం. 2 కోట్ల స్కాం జరిగినట్లు కొంత మంది కోర్టుకు వెళ్లారు. కొత్త కమిటీని ఏర్పాటు చేశారు. కానీ, వారిని ఇప్పటికీ అడుగు పెట్టనివ్వలేదు. తమకు తెలియకుండానే ఫినిక్స్ ఎంటరై పని చేస్తుందని పరిరక్షణ సమితి అధ్యక్షులు రాంమూర్తి తెలిపారు.
ఫినిక్స్ దందా ఎలా ఉంటుందంటే..
నాలుగేళ్ల క్రితం ఎంటరైన ఫినిక్స్.. జీహెచ్ఎంసీ అధికారులను అభివృద్ది పేరుతో ఆకట్టుకుంది. నిర్వహణ పేరుతో నిధులు సంపాదించవచ్చని నచ్చచెప్పింది. అధికార పార్టీ అండదండలు పుష్కలంగా ఉండటంతో లోపాయికారీ ఒప్పందాలు చేసుకున్నారు. ఆ ఒప్పందాలు ఎవరు అడిగిన బయటపెట్టడం లేదు. మహాప్రస్థానంలో ఎలా దహనం చేసినా.. శవానికి 10 వేల చొప్పున తీసుకుంటున్నారు. రెడ్ అంబులెన్స్ లాంటి సంస్థలతో సిండికేట్ గా ఏర్పడి ఎక్కడ చనిపోయినా తమ వద్దకే తీసుకొచ్చేలా కార్పొరేట్ ప్లాన్ కి పదును పెట్టారు. అదే స్టైల్ లో మార్కెటింగ్ చేసుకుంది. దీంతో 6ఏళ్లలో 18 కోట్లు సంపాదించారు. ఇక నగరం నడి ఒడ్డున ఉన్నపంజాగుట్ట స్మశాన వాటిక అయితే బిజినెస్ బాగా నడుస్తుందని అనుకున్నట్లు ఉన్నారు. ప్రభుత్వం టేక్ ఓవర్ చేసి కేవలం 2 కోట్ల రూపాయలు వెచ్చిస్తే.. మహా ప్రస్థానం కంటే గొప్పగా తయారు అయ్యేది. కానీ.. ఫినిక్స్ కోసమే అన్నట్లు పూర్తిగా నిర్వీర్యం చేశారు. ఒకే దారి ఉండే స్మశానానికి మూడు దారులు బారులుగా తెరిచారు. బోర్డులను తీసివేశారు. కమాన్ ని విరగ్గొట్టేశారు. అసాంఘీక శక్తులకు గేట్లు తెరిచారు.
అసాంఘీక శక్తులు చేరుతున్నా పట్టించుకోవడం లేదు- నిర్వాహకుడు
స్మశాన వాటిక మందు బాబులకు అడ్డాగా మారింది. అమ్మాయిలను కూడా తీసుకొస్తున్నారు. గేట్లు తీసివేయడంతో అసాంఘీక శక్తులు వచ్చి చేరాయి. పోలీసులకు, జీహెచ్ఎంసీకి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. మా బతుకుదెరువు పోతుందని చెప్పినా ఎవరూ స్పందించటం లేదని స్మశాన వాటిక నిర్వాహకుడు అక్షయ్ వాపోయారు. నిర్వహణ మేమే చూసుకుంటాం. సీఎస్ఆర్ ఫండ్స్ తో మీరు అభివృద్ది చేయండి అంటే.. కనీసం స్పందించడం లేదని అంటున్నారు. మాకు నిర్వహణ బాధ్యత ఇస్తే.. మేము వారికంటే ఎక్కువగా చేసి చూపిస్తామని అధికారులను వేడుకుంటున్నారు. వందేళ్లుగా ఇదే వృత్తిలో ఉండే.. 18 కుటుంబాలు దీనిపై ఆధారపడ్డాయి. ఇప్పుడు వారు మీకు 10 వేలు ఇస్తాం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
Advertisements
6 కోట్ల నష్టపరిహారం ఎవరికి ఇచ్చారో..
పంజాగుట్టలో 17 కోట్లతో నేరుగా స్మశానానికి వెళ్లేందుకు స్టీల్ బ్రిడ్జి నిర్మించారు. ఇవి రిలీజ్ అయినట్లు కూడా శంకుస్థాపనపై వేశారు. అందుకు 11 కోట్లు నిర్మాణ వ్యయం కాగా 6 కోట్లు భూ సేకరణకు అయిందని తెలిపారు. అది మొత్తం ప్రభుత్వ భూమే అయినప్పుడు భూసేకరణ ఎవరి దగ్గర చేశారో? ఆ 6 కోట్లు ఎవరికి ఇచ్చారో అర్థం కావటం లేదని నిర్వాహకులు అంటున్నారు.