– ఐకియా పక్కనే వేలకోట్ల భూముల కబ్జా
– హైటెక్ సిటీకి ఆమడదూరంలో బడా భూదందా
– 42 ఎకరాల ప్రభుత్వ భూమికి క్లియరెన్స్ ఇచ్చిన సర్కార్
– ఏపీ మంత్రి, టీఆర్ఎస్ పెద్దలకు బుకీగా ఫినిక్స్
– ఎలాంటి అనుమతులు లేకుండానే 6.5 ఎకరాల్లో నిర్మాణాలు
– 4 వేల కోట్లకు పైనే భూమి విలువ…
– నిర్మాణాలు పూర్తయితే 10 వేల కోట్ల లాభాలు
సైబరాబాద్ ఏరియాలో హాట్ కేక్ లాంటి బిట్టు. 42 ఎకరాలు. అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ 1975 ద్వారా మిగిలి ఉన్న ప్రభుత్వ భూమి. గచ్చిబౌలి గ్రామ రెవెన్యూలో సర్వే నెంబర్ 35, 37, 40, 42 నుంచి 47, 53 వరకు 137 ఎకరాల 17 గుంటల ప్రభుత్వ భూమిగా రికార్డుల్లో ఉంది. హైటెక్ సిటీ నిర్మాణంతో 90వ దశకంలో అప్పటి నేతల కన్ను ఈ భూమిపై పడింది. మహాదేవి కో ఆపరేటివ్ సొసైటీ పేరుతో దళితుల దగ్గర నుంచి ఎంత విస్తరణలో కొనుగోలు చేశారో చెప్పకుండానే రిజిస్ట్రేషన్స్ జరిగాయి. ఆయా వర్గాలకు ప్రభుత్వం పట్టాలు కూడా ఇచ్చింది. ఇందులో పొలిటికల్ సఫరర్స్, స్వాతంత్ర్య సమరయోధులు సైతం ఉన్నారు. కానీ.. వారికి ఇప్పటికీ భూమి ఎక్కడ ఉందో తెలియదు. ఉంటే వారిదేనా.. అని కూడా ప్రభుత్వం క్లారిటీ ఇవ్వని పరిస్థితి. అప్పుడు చూపిన అలసత్వం కారణంగా కబ్జాలు అయ్యాయి. మొత్తం 137 ఎకరాల్లో 95 ఎకరాల భూమి కబ్జా అయింది. 42 ఎకరాలు మాత్రం ఫినిక్స్ తో పాటు మూడు కంపెనీలకు అప్పగిస్తున్నామని.. గతంలో ఉన్న మెమోని రద్దు చేస్తున్నామని 2019 డిసెంబర్ లో తెలిపింది తెలంగాణ సర్కార్.
2013-2020కి మధ్యలో భూమి రేటు ఊహించనంతగా పెరిగింది. ఈ ఒక్క క్లియరెన్స్ తో నిర్మాణాలు జరిపి అమ్మకం చేసుకుంటే 10 వేల కోట్ల రూపాయలు మిగలడం ఖాయం. అటు ఏపీ ఇటు తెలంగాణ అధికార పార్టీ నేతల బినామీలు డైరెక్టర్స్ గా చేరారు. 75 శాతం వరకు వాటా ఉన్నట్లు సమాచారం. అదే నిజమైతే కనీసం 10వేల కోట్లు మిగిలినట్లే. భూమిపై పెట్టుబడి లేదు. కన్ స్ట్రక్షన్ కు అయ్యే ఖర్చు వెయ్యి కోట్లకు మించదు. పక్కనే అంతర్జాతీయ సంస్థ ఐకియా.. మరోవైపు డెలాయిట్.. ఇంకోవైపు మై హోం వ్యవస్థ.. ఎన్ని కోకాపేట ల్యాండ్స్ అమ్మితే ఇన్ని వేల కోట్లు రావాలి. కేసీఆర్, కేటీఆర్ చెప్పే రిచ్ తెలంగాణ అంటే ఇలాంటివే.
వివాదాస్పద భూములపై కొట్లాడితే తెలంగాణ ప్రజలవి అవుతాయి. అదే.. కాంప్రమైజ్ అయితే టీఆర్ఎస్ నేతల బినామీవి అవుతాయని చెప్పడానికి ఔటర్ ని ఆనుకుని ఉన్న ఫైనాన్స్ డిస్ట్రిక్ట్, గచ్చిబౌలి చాలు. కొన్ని భూముల్లో కొట్లాడినట్లు యాక్ట్ చేసి.. మిగతా భూములను దారాదత్తం చేస్తున్నారు. ఒక్కొక్క ఏరియాలో వివిధ రకాలుగా వ్యవహరిస్తూ తెలంగాణ సంపదను దొచుకుంటున్నారు. కేసీఆర్ చెప్పినట్లు కొద్దిపాటి సంపదను అమ్మితేనే 2 వేల కోట్లు వచ్చాయన్నది ఎంత నిజమో.. టీఆర్ఎస్ సర్కార్ వచ్చిన తర్వాత చేసిన లక్షల కోట్ల భూ వ్యవహారాల్లో గచ్చిబౌలి ఫినిక్స్ ఒకటి. అసలు ఈ ఫినిక్స్ భూ ఫిక్సింగ్ కు బుకీగా ఎలా మారింది..? కంపెనీలో డైరెక్టర్ల మార్పు ఎందుకు…? గతంలో వారి చరిత్ర ఎంటి..? ఆంధ్రప్రదేశ్ మంత్రికి తెలంగాణ యువ మంత్రికి మధ్య జరిగిన డీలింగ్ ఎంత..? 1996 నుంచి 2021 వరకు గచ్చిబౌలిలో ప్రభుత్వ భూముల వ్యవహారాలన్నీ మీ ముందుకు తెస్తోంది తొలివెలుగు.