– సక్కుబాయి భూములపై ఫినిక్స్ కన్ను
– టీఆర్ఎస్ సహా అన్ని పార్టీలు ఫిక్స్
– 30 ఎకరాల సర్కార్ భూమి..
– ఏడాదిన్నరగా నో యాక్షన్
– చక్రం తిప్పుతున్న నార్నే అరవింద్, నాగ కిశోర్
– ఫినిక్స్ ఫిక్స్ అయిన ప్రతీ భూమిని..
– క్లియర్ చేస్తున్న టీఆర్ఎస్ సర్కార్!
– భూమిని కాపాడేందుకు కలెక్టర్ నుంచి ప్రిన్సిపల్ సెక్రెటరికి ఫైల్
– ఫినిక్స్ భూ ఫిక్సింగ్ పార్ట్-22
వడ్డించేవాడు మనోడైతే ఎక్కడున్నా అన్నీ సమకూరుతాయనేది నానుడి. ఇది అన్నింటికీ వర్తిస్తుంది. నగరంలో ఫినిక్స్ భూ ఫిక్సింగ్ కూడా అంతే. ఫినిక్స్ ఇండియా కంపెనీ కోరిన భూములన్నింటనీ క్లియర్ చేసి పెడుతోంది టీఆర్ఎస్ సర్కార్. తొలివెలుగు క్రైం బ్యూరో ఇప్పటికే డజన్ ఏరియాలు బయటపెట్టింది. పద్మాలయా స్టూడియో 10 ఎకరాలు, హైటెక్ సిటీ ఐకియా పక్కన 42 ఎకరాలు, నార్సింగ్- 2 చెరువు 10 ఎకరాలు, జూబ్లీహిల్స్ లోని రోడ్డు నెంబర్ 46లో హిల్ సైడ్ స్కూల్ రెండున్నర ఎకరాలు, గచ్చిబౌలిలో 16 ఎకరాలు, కూకట్ పల్లిలో గల్ఫ్ అయిల్ కార్పొరేషన్ కు చెందిన 42 ఎకరాలు. శంషాబాద్ దగ్గర మామిడిపల్లిలో 60 ఎకరాలు.. వీటితో పాటు మరో నాలుగు ఏరియాలో మూడో కంటికి తెలియకుండా ప్రభుత్వంతో పాటు ప్రతిపక్ష నాయకులను బుట్టలో వేసుకుని క్రికెట్ మ్యాచ్ ఫిక్సింగ్ లా భూ ఫిక్సింగ్ కి పాల్పడింది ఫినిక్స్. అటు ఐఏఎస్ లను, ఐపీఎస్ లనూ తమ గుప్పిట్లో ఉంచుకొని విషయాన్ని బయటకు పొక్కనివ్వడం లేదు. కానీ.. తొలివెలుగు వారి గుట్టు రట్టు చేస్తుండటంతో ఏ ఒక్కరికీ పొసగడం లేదు. అందరి తీరు బయటి ప్రపంచానికి తెలుస్తోందని లోలోపల మదనపడుతున్నారు. తాజాగా మణికొండలో 30 ఎకరాల ప్రభుత్వ భూమిని ఫినిక్స్ చేతికి ఇవ్వబోతున్నారు.
ఎవరేం రాసుకున్నా ఏం కాదు..?
తిట్లు గాలికి పోయే.. తిండి ఒంటికి పట్టే అన్నచందంగా ఉంది ఫినిక్స్ వ్యవహారం. ఎవడైనా తప్పు చేస్తుంటే ఇది తప్పు.. లాలూచి పడి విలువైన ప్రబుత్వ భూములను కలిసి కొట్టేస్తున్నారని చెబితే.. తమకేం పట్టనట్లుగా వ్యవహరిస్తోంది. ఎవరూ చర్యలు తీసుకోవడం లేదు. అయినా.. ఫోర్త్ ఎస్టేట్ గా తొలివెలుగు ప్రజల ముందు అన్ని అక్రమాలను ఉంచుతోంది. అయితే.. వారు తప్పు చేయకుంటే పేర్లు, ఫోటోలతో సహా వార్తలు రాసినప్పుడు పరువు నష్టం వాటిళ్లుతుందని కోర్టును ఆశ్రయించే అవకాశాలు ఉంటాయి. ఇలా చాలా సంఘటనలే తొలివెలుగుకు ఎదురయ్యాయి. దీటుగా కోర్టుల్లో ఎదుర్కొన్నాం. కానీ.. ఫినిక్స్ ఇందుకు డిఫరెంట్ గా వ్వవహరిస్తోంది. తేలుకుట్టిన దొంగలాగా ఉంటోంది. రాసుకునేవారు రాసుకుంటారు. అందరూ తమ వైపు ఉన్నారు. మెయిన్ మీడియా ఓనర్స్ మా ప్రెండ్స్ అయినప్పుడు పట్టించుకోవాల్సిన అవసరం లేదని… ప్రభుత్వ భూములను అక్రమంగా మింగేస్తూ అడ్డంగా సంపాదిస్తోంది. క్విడ్ ప్రో కో ద్వారా నాయకులను శాసిస్తోంది.
సక్కుబాయి నగర్ లో ఏం జరుగుతోంది?
షేక్ పేట మండలం నారాయణమ్మ కాలేజీ దగ్గర మణికొండ ఓయూ కాలనీకి ఆనుకుని ఉన్న సర్వే నెంబర్ 327(పాతది), 602, 605(కొత్త)లో 30 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండేది. ఇద్దరు వ్యక్తులు ఆ భూమి తమదంటే తమదని కోర్టుకు వెళ్లారు. పత్రాలన్నీ గమనించి ఆ భూమి ప్రభుత్వానిదని ఉత్తర్వులు ఇచ్చింది న్యాయస్థానం. ఎమ్మార్వో చంద్రకళ ఉన్న సమయంలో భూమి దగ్గర బొర్డులు కూడా పాతారు. వారి నుంచి స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆ ఉత్తర్వులను సవాలు చేస్తూ మళ్లీ ఉన్నత న్యాయస్థానానికి వెళ్లారు. చంద్రకళ బదిలీ కావడం.. ఎమ్మార్వో వెంకట్ రెడ్డి తనకున్న నాలెడ్జీతోనే అఫిడవిట్ వేయడం జరిగాయి. ఇందుకు తెర వెనక ఎన్నో తతంగాలు జరిగాయని గుసగుసలు ఉన్నాయి. అప్పటికే అధికారులను ఏమార్చి 1954లో సక్కుబాయి కుటుంబానికి కేటాయించారని నివేదిక ఇచ్చారు. దీంతో.. భూమి ప్రైవేట్ దని కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయితే టైటిల్ మాత్రం కింది కోర్టులో కేసు వేసుకుని తేల్చుకోవాలని జస్టిస్ ఎంఎస్ రాంచందర్ బెంచ్ తీర్పునిచ్చింది. దీంతో కలెక్టర్ కోర్టులో కేసు వేసేందుకు అడ్వకేట్ జనరల్ ఓపినియన్ తీసుకుని డ్రాప్ట్ తయారు చేసి రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రెటరీకి పంపారు. ఏడాదిన్నర నుంచి ఇప్పటి వరకు సివిల్ కోర్టులో ప్రభుత్వం ఒరిజినల్ సూట్ దాఖలు చేయలేదు. ఫినిక్స్ తో ఫిక్స్ అయ్యారు కాబట్టి ఇప్పటి వరకు ఫైల్ కదలడం లేదు. దీనికి తోడుగా ఫినిక్స్ వియ్యంకుడుగా చెప్పుకునే నార్నే అరవింద్.. ప్లాట్ ఓనర్స్ వద్ద నుంచి తమ అనుకూలమైన సామాజిక వర్గానికి చెందిన వారికి తక్కువలో కొనుగోలు చేసి ఇప్పిస్తున్నారు. జింకానా క్లబ్ సెక్రెటరీగా పని చేస్తున్న నుటక్కి నాగ కిషోర్ కూడా చక్రం తిప్పుతున్నారు. అందరూ కలిసి 5 ఎకరాలు ఫినిక్స్ కి ఇచ్చేస్తే మీ ప్లాట్స్ మీకు దక్కుతాయని చెబుతున్నారు. రోడ్లు, పార్క్, ప్లేస్ అంతా కలుపుకుని ఎత్తైన అపార్ట్ మెంట్ల నిర్మాణాలు చేయించుకుని లాభపడేందుకు పథకాలు రచిస్తున్నారు.
నార్నే అరవింద్ కూడా ఫినిక్స్ కంపెనీలో డైరెక్టరే!
ఫినిక్స్ ఎవర్ స్పిన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని శ్రీకాంత్ బడిగేతో కలిసి నార్నే అరవింద్ ఏర్పాటు చేశారు. ఆయనకు యువరాజుతో అమెరికాలో ఉన్న పాత పరిచయంతో ఇక్కడ భూములపై వ్యాపారం చేసేందుకు వచ్చినట్లు సమాచారం. అందుకు ఒక్క సైట్ ని ప్రభుత్వం నుంచి క్లియర్ చేసుకుంటే జీవితాంతం అమెరికాలో సంపాదించిన దాని కంటే ఎక్కవ వస్తుందనే ఆశతో ఇక్కడికి వచ్చినట్లు ప్రచారంలో ఉంది. ఈ నేపథ్యంలోనే సక్కుబాయి నగర్ మ్యూచివల్ ఎయిడెడ్ కో ఆపరేటివ్ సొసైటీని తన గుప్పిట్లో పెట్టుకొని 30 ఎకరాల్లో బిజినెస్ చేసుకోవడానికి ప్రయత్నాలు ముగింపునకు వచ్చాయి. దీంతో ఏ అధికారులు కూడా ఈ ల్యాండ్ పై సరైన వివరాలు ఇవ్వడం లేదు. సివిల్ కోర్టులో కేసు వేయబోతున్నామని మాత్రమే చెబుతున్నారు. హైకోర్టులో కేసు ఉన్నందునే బోర్డులు తీసివేశామని షేక్ పేట ఎమ్మార్వో తొలివెలుగుకు తెలిపారు.