– కూకట్ పల్లిలో గులాబీల ఇళ్లకు ముహూర్తం!
– వివాదస్పద స్థలంలో నిర్మాణాలకు ప్లాన్
– వెయ్యి గజాల నుంచి 4 వేల గజాల వరకు విల్లాలు
– చక్రం తిప్పుతున్న ఎమ్మెల్సీ?
– ఫినిక్స్ కి ఫిక్స్ అయిన 42 ఎకరాల్లో 32 ఎకరాలకే డబ్బులు
– వెయ్యి కోట్ల టర్నోవర్ అంటూనే అప్పనంగా భూముల అమ్మకం
– హిందుజా వ్యవహారంతో షేర్ హోల్డర్స్ కి భారీ నష్టం
– ఫినిక్స్ భూ ఫిక్సింగ్ పార్ట్-29
– తొలివెలుగు క్రైంబ్యూరో పరిశోధనలో బయటపడ్డ సంచలన నిజాలు
క్రైంబ్యూరో, తొలివెలుగు:కబ్జాలకు పెట్టింది పేరుగా ఫినిక్స్ దందాలు కొనసాగుతున్నాయి. వివాదాస్పద భూములే టార్గెట్ గా అన్నింటినీ మేనేజ్ చేసుకుంటూ అందినకాడికి దోచేస్తోంది. ఈ క్రమంలోనే కూకట్ పల్లి ఐడీఎల్ భూములకు రెక్కలొచ్చాయి. హిందుజా కంపెనీ కొంతమంది సొంత ప్రయోజనాల కోసం ఇండస్ట్రీ ల్యాండ్స్ ని ఎకరం రూ.10 కోట్లకే అమ్మేసింది. 2021 అగస్టు 27న 42.25 ఎకరాలు ఫినిక్స్ కంపెనీ సిస్టర్ సంస్థకు అమ్మకానికి పెట్టింది. తాజాగా 2022 మే 31న 32 ఎకరాల భూమిని రూ.326.80 కోట్లకు అమ్ముతున్నట్లు బీఎస్ఈ లిమిటెడ్ కి, నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కి తెలిపింది.
ఆ పదెకరాలు ఎవరికి?
వివాదంలో ఉన్న మరో 10 ఎకరాల భూమిని మధ్యవర్తిత్వం ద్వారా పంచుకున్నట్లు సమాచారం. దళిత, గిరిజనులకు కేటాయించిన భూమిని తీసుకుని ఇండస్ట్రియల్ కోసం అప్పటి ప్రభుత్వం ఇస్తే.. ఇప్పటి టీఆర్ఎస్ సర్కార్.. తన బీనామీ కార్పొరేట్ సంస్థలకు వేల కోట్ల లాభం వచ్చేలా వ్యవహరిస్తోంది. స్థలాన్ని విక్రయించడానికి వీలు లేదు. కానీ ఏకంగా హెచ్ఎండీఏలో మాస్టర్ ప్లాన్ లో.. పేలుడు పదార్ధాల కంపెనీ నడుస్తుండగానే మల్టీపర్పస్ జోన్ గా మార్చేసింది. మిగిలిన 700 ఎకరాలకు క్లియర్ చేయాలంటే.. స్థానిక నేతల అండదండలు ఉండాలి. నగర శివార్లలో ఉండే నేతలకు సెంటర్ సిటీ అయిన కూకట్ పల్లిలో లగ్జరీ ఇళ్లు కావాలి. దీంతో వారితో రాయబారం నడిపించారు స్థానిక ఎమ్మెల్సీ. ఆ నేత పక్కా లోకల్, గోల్డెన్ స్పూన్ కావడం.. అందరితో చనువుగా నీజాయితీగా ఉండటంతో.. ఆయనపై పెట్టిన నమ్మకంతో కొంత అడ్వాన్స్ లు కూడా ముట్టినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. అందరూ నేతలైతే.. ఎవరూ అడ్డుపడరని ఆ పదెకరాలు గులాబీ నేతల ఇళ్ల కోసమే సెటిల్మెంట్ చేశారంటూ గుసగుసలాడుకుంటున్నారు.
డబ్బులే ఇవ్వలేదు.. పనులు ఎలా?
రూ.326 కోట్లకు మరో రూ.12 కోట్లు పెండింగ్ లో ఉన్నాయి. అయినా హానర్స్ సంస్థ భూమిని చదును చేస్తోంది. ఎలాంటి అనుమతులు లేకుండానే ప్లాట్స్ అమ్మకం అంటూ.. ప్రీలాంచ్ కి స్వాగతం పలుకుతోంది.
తర్వాత భూముల్లో మిగితా నాయకులకు?
కూకట్ పల్లిలో ఇళ్లు కావాలంటే ఎవరు వద్దంటారు. నేతలైతే.. సంకలు గుద్దుకుంటారు. సుప్రీంకోర్టులో కేసు ఉన్నందున ప్రజాప్రతినిధులకు ఇళ్ల స్థలాలు కేటాయించడం లేదని కేసీఆర్ చెప్పారు. కానీ మధ్యేమార్గంగా వివాదాస్పద భూమిలో అయితే.. నిర్మాణం ఖర్చు పెట్టుకుంటే అన్నీ తామే చూసుకుంటామని ఫినిక్స్ తో పాటు వారి వద్ద నుంచి కొనుగోలు చేసిన ఆర్ఎస్ బ్రదర్స్ సంస్థలు ముందుకు వచ్చినట్లు సమాచారం. దీంతో ఫ్యూచర్ అవసరాల కోసం నేతలందరికి మిగితా భూమి కొనుగోలు చేసిన తర్వాత ఇస్తామని హామీ ఇచ్చారట.
శంషీగూడ 57లో ఫినిక్స్ దందా?
శంషీగూడ సర్వే నెంబర్ 57 మొత్తం ప్రభుత్వ భూమే. కానీ.. నాయకులు తలుచుకుంటే ఏముంటుంది. 25 ఏళ్లుగా వివాదంలో ఉన్న 100 ఎకరాల భూమికి రెక్కలొచ్చాయి. అసలేం జరిగింది. ఎలా కాజేశారు. సివిల్ డ్రెస్ లో సింగిల్ గా వచ్చిన మంత్రి ఎమన్నారో.. ఫినిక్స్ భూ ఫిక్సింగ్ పార్ట్-30లో మీ ముందు ఉంచుతుంది తొలివెలుగు.