– పదెకరాల చెరువుపై కన్నేసిన ఫినిక్స్
– మట్టి నింపేసి పట్టా భూమిగా కలరింగ్
– ఆనాటి ఫైల్స్ అన్నీ మిస్సింగ్
– హెచ్ఎండీఏ నో పర్మిషన్
– అయినా..అడ్డదారిలో అనుమతులు
– ఎన్జీటీలో కేసు పెండింగ్…
– ఐనా టీఎస్ఐఐసీ ద్వారా అనుమతులు
మోసం చేయాలన్నా.. మాయ చేయాలన్నా అదో ఆర్ట్. అందరికీ అయ్యేది కాదు. పైకేమో శుద్ధపూస కబుర్లన్నీ చెప్పి.. వెనకేమో అంతా సైలెంట్ గా చేస్తుంటారు. ఫినిక్స్ భూ ఫిక్సింగ్ కూడా అంతే. పైకి అన్నీ కరెక్ట్ గా చేస్తున్నామని కలరింగ్ ఇచ్చి.. చేయాల్సిన దందా అంతా సైలెంట్ గా జరుగుతోంది. నార్సింగ్ అవతార్ జంక్షన్ దగ్గర చెరువు కబ్జానే ఇందుకు నిదర్శనం. నార్సింగ్ 2 అని పిలిచే పదెకరాల చెరువును కబ్జా చేసి వెయ్యి కోట్ల దందా నడిపిస్తున్నారంటేనే అర్థం చేసుకోండి.. దాని వెనుక ఎంత కథ నడిచిందో. చెరువుని సెల్లార్ గా చేసేశారు. పక్కన ఉన్న మరో 7 ఎకరాల చెరువులో రాళ్లు, మట్టి నింపేశారు. అధికారం తమ చుట్టమైతే.. అది చెరువైనా, కొండలైన తమ వశం కావాల్సిందే అన్నట్లుగా వ్యవహరించారు. ఇప్పుడు అక్కడికి వెళితే చెరువు అనవాళ్లు కూడా ఉండవు. అంతలా మార్చేశారు. ఓఆర్ఆర్ రాగానే అమాంతంగా రేట్లు పెరగడంతో చెరువుకు ఉరిపోశారు. అధికారులను మేనేజ్ చేసి లేక్ ఐడీని హెచ్ఎండీఏ నుంచి తొలగించారు. కానీ మాస్టర్ ప్లాన్ ని మార్చలేకపోయారు. ప్రైం ఏరియాలో పదెకరాల చెరువుని కబ్జా చేసినా పట్టించుకునే నాథుడు లేకపోవడంతో తొలివెలుగు రంగంలోకి దిగింది. వారి బాగోతాన్ని బట్టబయలు చేసింది.
హెచ్ఎండీఏ కాదని టీఎస్ఐఐసీకి ఎందుకు వెళ్లినట్టు..
హైదరాబాద్ లో ఎలాంటి నిర్మాణాలకైనా హెచ్ఎండీఏనే ఫైనల్. అయితే టీఎస్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ నుంచి బిల్డింగ్ పర్మిషన్ తెచ్చుకున్నారు. హెచ్ఎండీఏ మాస్టర్ ప్లాన్ ప్రకారం ఆ ప్రాంతంలో చెరువు ఉంది.. ఎలాంటి నిర్మాణాలు చేపట్టడానికి వీలులేదు. అది గ్రీన్ జోన్ గా ఉంది. అయితే ఇటీవల మొక్కలు నాటేందుకు కొంతమందికి అనుమతులు ఇచ్చారు. కానీ అప్పటికే ఫినిక్స్ తో పాటు మరో న్యాయవాది కబ్జా చేసి మట్టి, రాళ్లు నింపేశారు. కమర్షియల్ కాంప్లెక్స్ పేరుతో టీఎస్ఐఐసీ నుంచి దొంగపత్రాలతో అనుమతులు తెచ్చుకోవడంతో రెరా పర్మిషన్ ఇచ్చేసింది. వివిధ డిపార్ట్ మెంట్స్ తో కో ఆర్డినేషన్ చేసుకుని ఇవ్వాల్సిన అనుమతులు.. టైటిల్ లో ఉన్న భూమి కంటే ఎక్కువ పోజిషన్ లో ఉన్నా.. కేవలం సెల్ డీడ్ తో అనుమతులు పొందారని ఆరోపణలు ఉన్నాయి.
ఇనాం భూముల్లో ఇలా ఎక్కువ కోట్టేశారు
పుప్పాలగూడలోని సర్వే నెంబర్ 263 నుంచి 273 వరకు 40 ఎకరాల్లో వివాదం ఉండేది. ధరలు పెరుగుతున్న కొద్ది లిటిగేషన్ ఎక్కువ చేశారు. అయితే 272లో 6 ఎకరాల 39 గుంటలు, 273లో 9ఎకరాల 17 గుంటల భూమి లిటిగేషన్ లో ఉండేది. వివిధ కేసులతో ఒరిజినల్ సూట్ నెంబర్.259/1994, 803/2003 481/2007 గా కోర్టుల్లో విచారణ జరిగింది. సయ్యద్ మొహినుద్దిన్ పట్టాగా.. పీటీ వారసులుగా మరికొందరు ఉన్నారు. పొజిషన్ లో నార్సింగ్ గ్రామస్తులు ఉండేవారు. 2009లో పీటీ సర్టిఫికెట్ తెచ్చుకున్నారు. అప్పటికి వివాదం ముదరడంతో.. అందరం కలిసి సెటిల్మెంట్ చేసుకుందామని డీఎల్ఎఫ్ తో ఒప్పందం కుదుర్చుకున్నారు. పక్కనే ఔటర్ రింగ్ రోడ్డు కావడంతో పలు కంపెనీలు ముందుకొచ్చాయి. డీఎల్ఎఫ్, మై హోం కలిసి ఆ భూముల్లో జాయింట్ వెంచర్ చేశారు. మై హోం అవతార్ నిర్మించింది. అయితే పక్కనే ఉన్న చెరువు, దాని పక్కన గ్రీనరీ ఉండాలని హెచ్ఎండీఏ మాస్టర్ ప్లాన్ లో ఉంది. కానీ.. అప్పటి వరకు వివాదాల్లో ఉన్న భూమిని, నీటితో ఉన్న కుంటని కలిపి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మొత్తం 53 ఎకరాల స్థలంగా చిత్రీకరించారు. 43 ఎకరాలు డీఎల్ఎఫ్ తీసుకోగా.. చెరువులోని 10 ఎకరాల భూమిని నార్సింగ్ గ్రామానికి చెందిన కొత్తకాపు ముత్యం రెడ్డికి ఇచ్చేశారు. చెరువులో ఉన్న భూమిని కబ్జా చేసేందుకు అధికారులు ఒప్పుకోలేదు. ఆ లేక్ కి ఐడీ నెంబర్ 2939 అని హెచ్ఎండీఏ సర్వే చేసి నార్సింగ్ 2 చెరువు అని పేరు పెట్టింది. అంతకుముందే మాస్టర్ ప్లాన్ లో చాలా క్లియర్ గా ఉంది. కానీ ఫినిక్స్ ఎంట్రీ కావడంతో సీన్ రివర్స్ అయింది. హెచ్ఎండీఏ చెరువు లేకుండా పోయింది. వెబ్ సైట్ లో ఆ డీటెయిల్స్ తీసివేశారు. 10 ఎకరాల భూమిని అప్పనంగా కొట్టేసి.. చెరువులోనే నిర్మాణాలు చేపట్టింది ఫినిక్స్. ఇప్పుడు మార్కెట్ ధర అక్కడ ఎకరం రూ.80 కోట్లుగా ఉంది. అంటే 800 కోట్ల రూపాయల ప్రభుత్వ భూమిని ఫినిక్స్ కబ్జా చేసిందన్నమాట.
ఎన్జీటీలో నోరు మెదపని అధికారులు
గతేడాది ఫిబ్రవరి 20న సామాజిక కార్యకర్త లుబ్నా సర్వత్ ఎన్జీటీలో కేసు వేశారు. అయితే ఇప్పటి వరకు రంగారెడ్డి కలెక్టర్, హెచ్ఎండీఏ లేక్ ప్రొటెక్షన్ వారు అఫిడవిట్ దాఖలు చేయలేదు. ఇప్పటి వరకు 14 సార్లు లిస్టింగ్ అయినా.. అధికారులు టైం కోరుతున్నారు తప్ప.. అసలు ఏం జరిగిందో చెప్పడం లేదు. ఫినిక్స్ మాత్రం అక్రమంగా హెచ్ఎండీఏ నుంచి కాకుండా టీఎస్ఐఐసీ నుంచి అనుమతులు తీసుకుని.. నిర్మాణం మొదలు కాకుండానే రెరా అధికారుల సహకారంతో అనుమతులు తీసుకొని ఒక వైపు సెల్లార్ తవ్వకాలను పూర్తి చేస్తూ.. ఫ్రీలాంచ్ పేరుతో ఒక్కొక్క స్క్వేర్ ఫీట్ ని రూ.7 వేల చొప్పున అమ్మేస్తోంది. ఎవరైనా కొనుగోలు చేస్తే 5 వేల అడుగుల కంటే తక్కువ ఉండవద్దని షరతులు పెడుతోంది. ఒక్కొక్క ఫ్లోర్ కి 65 వేల అడుగులు నిర్మిస్తున్నామని చెబుతోంది. మూడు టవర్స్ పేరుతో చివరి వరకు సుమారు రూ.3 వేల కోట్ల బిజినెస్ చేయనుంది. ఇంత జరుగుతున్నా ఏ అధికారి, ఏ పొలిటీషియన్ పట్టించుకున్న పాపాన పోలేదు. ఎందుకంటే ఎవరినైనా ఫిక్సింగ్ చేసే ఘనత ఫినిక్స్ కే సొంతమని టాక్. ఇక పుప్పాలగూడలోని మేకసాని కుంట, మామాసాని కుంట, బొలక్ పూర్ నాలా కబ్జా చేసి తెలంగాణ భూములను, చెరువులను చుక్కపల్లి సురేష్ కుటుంబం ఎలా చెరబడుతోందో పార్ట్-11 లో చూద్దాం.