– అప్పుడు రాద్ధాంతం.. ఇప్పుడంతా వారిదే రాజ్యం
– వైఎస్ హయాంలో భూములు స్వాధీనం
– కేసీఆర్ ప్రభుత్వంలో దారాదత్తం
– పద్మాలయ స్టూడియోలో పాగా వేసిన ఫినిక్స్
– హీరో మహేష్ బాబు గారి పాట ఎంత..?
– ఆనాడు గత్తర లేపిన హరీష్ రావు సైలెంట్ వెనుక కారణాలేంటి?
– జీ టెలిఫిల్మ్స్ కో రూల్, ఫినిక్స్ కో రూలా..?
– తొలివెలుగు ఎక్స్ క్లూజివ్ కథనం
క్రైంబ్యూరో, తొలివెలుగు:తెలంగాణ రాకముందు సినిమా పెద్దలకు ఇచ్చిన భూములు అమ్ముకుంటే నానా గత్తరలేపారు. సెంటిమెంట్ రగిలించి రాద్ధాంతం చేశారు. తీరా.. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక తెలంగాణ భూములను రియల్ ఎస్టేట్ సంస్థగా మార్చేస్తున్నారు. తొలివెలుగు క్రైం బ్యూరో ఇన్విస్టేగేషన్ లో కళ్లు బైర్లు కమ్మే నిజాలు బయటపడుతున్నాయి. ఇప్పటికే ఫినిక్స్ భూ ఫిక్సింగ్ అంటూ 10 కథనాలతో బండారం బయటపెట్టగా.. తవ్వే కొద్దీ కబ్జా లీలలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, టీఎస్ఐఐసీ, రెరా అధికారులు గులాబీ నోట్లకు ఆశపడి ఫినిక్స్ కంపెనీకి జీ హుజూర్ అంటున్నారు. ఏ ఒక్క రాజకీయ పక్షం కూడా మాట్లాడకుండా లీడర్ల నోళ్లు మూయించేందుకు గిఫ్టుల రూపంలో విల్లాలు, ప్లాట్స్ ఇస్తున్నట్లు సమాచారం. ఏ భూమినైనా ఇట్లాగే క్లియర్ చేసుకొని వేల కోట్ల రూపాయలు బొక్కేస్తున్నారు.
పద్మాలయ స్టూడియోపై టీఆర్ఎస్ సర్కార్ పాత పాట..?
తెలంగాణ ప్రభుత్వం ఏర్పడగానే ఫిల్మ్ ఇండ్రస్టీ భూములపై ఉక్కుపాదం మోపి అక్రమాలకు తావు లేకుండా చలన చిత్ర సంస్థ భూములను బతికిస్తుందని అంతా అనుకున్నారు. అందులో మొదటగా సూపర్ స్టార్ కృష్ణ కుటుంబం బలి అవుతుందని అంతా భావించారు. పద్మాలయ స్టూడియో భూముల్లోని కొంత భాగాన్ని నిబంధనలకు విరుద్దంగా తెగనమ్ముకున్నారని కృష్ణ ఫ్యామిలీని బద్నాం చేశారు. అన్యాక్రాంతం అయిన ఆ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని 2008 నుంచి టీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. హరీష్ రావు అయితే నేరుగా హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. కానీ.. సంబంధిత డిపార్ట్ మెంట్లకు అప్లికేషన్స్ ఇవ్వకుండా నేరుగా ఎలా వస్తారని పిటిషన్ ను తొసిపుచ్చింది న్యాయస్థానం. ఆ తర్వాత మళ్లీ ఈ ఇష్యూ వైపు ఆయన కన్నెత్తి చూడలేదు. వైఎస్ హయాంలో అధికార పక్షం అండదండలతో తమ పలుకుబడి ఉపయోగించి ఆ భూములను తమ చేయి జారిపోకుండా కృష్ణ ప్యామిలీ పావులు కదుపుతూ వచ్చింది. కానీ తెలంగాణ ఏర్పడ్డాక ఆ భూములు ప్రభుత్వ స్వాధీనం అవుతాయని అనుకుంటే.. అసలుకే ఎసరు పెట్టేలా ఆంధ్రా రియల్ ఎస్టేట్ కంపెనీకి రూట్ క్లియర్ చేశారు.
అసలేం జరిగింది..?
ఫిల్మ్ ఇండస్ట్రీ చెన్నై నుంచి హైదరాబాద్ కు తరలివచ్చిన తర్వాత పరిశ్రమ అభివృద్ధి కోసం 1982లో అప్పటి ప్రభుత్వం షేక్ పేటలో 50 ఎకరాల భూమిని కేటాయించింది. ఇండస్ట్రీ ఎదగాలన్న ఉద్దేశంతో ఎకరాకు 8వేల 500 రూపాయలు మాత్రమే తీసుకుంది. సూపర్ స్టార్ కృష్ణకు పద్మాలయ స్టూడియోస్ కోసం 9ఎకరాల 20గుంటలు కేటాయించింది. అలాగే స్టూడియోల పేరుతో జూబ్లీహిల్స్, ఫిల్మ్ నగర్ లో కృష్ణతోపాటు రామానాయుడు, అక్కినేని, ఎన్టీఆర్ కుటుంబాలకు కూడా భూములు ఇచ్చింది. అయితే కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఈ నలుగురు ఫ్యామిలీలకే ఎక్కువ భూములు కేటాయించడం జరిగింది. ఆ భూముల్ని చలన చిత్ర పరిశ్రమ అభివృద్ధికి మాత్రమే ఉపయోగించాలి. ప్రభుత్వ ఉద్దేశం నెరవేరకపోతే తిరిగి స్వాధీనం చేసుకునే హక్కు ఉంటుంది. కానీ రూల్స్ కు విరుద్దంగా పద్మాలయ టెలీఫిల్మ్స్ ఏర్పాటు చేశారు. కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు, కుమారుడు రమేశ్ బాబు డైరెక్టర్లుగా నెలకొల్పిన ఈ సంస్థ జీ టెలీఫిల్మ్స్ తో రూల్స్ కు వ్యతిరేకంగా వ్యాపారం చేసింది. అయితే ఇక్కడే కథ అడ్డం తిరిగింది. సొంత ప్రయోజనాల కోసం భూములను వాడుకోవడం.. సంస్థలో నష్టాలు రావడంతో జీ సంస్థకు 60 కోట్లు ఇవ్వాల్సి రాగా.. 5 ఎకరాల 20 గుంటల భూమిని అమ్మేశారు. దీంతో లెక్కలు సరి చేసుకున్నారు. మిగితా భూమిని కృష్ణ కుమారుడు, కూతురుతో పాటు ఎనిమిది మంది రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అక్రమంగా అమ్మకాలు జరిపిన ఆ మొత్తం భూమి విలువ ఇప్పుడు రూ.6 వందల కోట్లు. అయితే దీంట్లో ఫినిక్స్ చాకచక్యంగా ఇప్పటికే భవనాలు నిర్మించి అమ్మకాలు జరిపి వేల కోట్ల రూపాయలు దండుకుంది.
వైఎస్ఆర్ హయాంలో స్వాధీనం – కేసీఆర్ హయాంలో పర్మిషన్
భూములను జీ టెలీఫిల్మ్స్ కు విక్రయించడాన్ని ఆనాటి ప్రభుత్వం తప్పుపట్టింది. అలా ఎలా అప్పగిస్తారంటూ అధికారులు నోటీసులు ఇచ్చారు. జీ సంస్థకు అమ్మిన భూమిని 2007లో వైఎస్ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. సర్కార్ భూమి అని రెవెన్యూ అధికారులు బోర్డు కూడా పెట్టారు. వైఎస్ ప్రభుత్వంలో కృష్ణ వియ్యంకురాలు గల్లా అరుణ కుమారి మంత్రిగా ఉండటం బాగా కలిసొచ్చి.. ఫైల్ క్లియర్ అయింది. అప్పుడు సిసిఎల్ఏ.. జీ కి అమ్ముకోవడంలో తప్పు లేదని పేర్కొంది. నాటి కలెక్టర్ పద్మాలయకు ఊరట కలిగించేలా ఉత్తర్వులు ఇచ్చారు. సికింద్రాబాద్ రెవెన్యూ అధికారి మ్యుటేషన్ చేశారు. ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న భూములను తిరిగి అప్పగించారు. అయితే పైకి ఇదంతా అధికారికంగా జరిగినట్లు కనిపించినా.. తెరవెనుక చాలానే తతంగం నడిపించారని వినికిడి. అప్పుడు ఆంధ్రా నిబంధనలు వర్తింపచేశారని వైఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మొదటగా మ్యుటేషన్ పై అప్పీల్ కి వెళ్లారు. మ్యుటేషన్ చెల్లదని అప్పీల్ లో తేల్చేశారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక లిటిగేషన్ ఉన్న భూమిని.. క్లియర్ అని చెప్పడంతోపాటు.. ఫినిక్స్ కంపెనీకి బంగారుపళ్లెంలో పెట్టి ఇచ్చేశారు.
తెలంగాణ సర్కార్ లో ఎవరి పాట ఎంత..? అమ్మకానికి వీలుకాని భూమికి రెండోదశలో మహేష్ బాబు, తన సోదరి గల్లా పద్మావతికి ఎన్ని కోట్ల లాభం చేకూరింది. ఫినిక్స్ కి భూమి ఇవ్వడంలో కథ నడిపిందెవరు? అనుమతులు ఎలా వచ్చాయి? షేక్ పేటలో షాకింగ్ భూ ఫిక్సింగ్ తతంగంపై పార్ట్-12లో చూద్దాం.