– పార్టీ ఏదైనా మేనేజ్ చేయటం కామన్
– అక్రమ జీవోలు పుట్టించటం ఫినిక్స్ స్పెషాలిటీ
– తొలివెలుగు క్రైంబ్యూరో స్టింగ్ ఆపరేషన్ లో..
– ఫినిక్స్ అక్రమాల గుట్టు రట్టు
– కమర్షియల్ స్పేస్ తో కోట్లకు పడగలు
– బినామీలుగా వచ్చి..బిందాజ్ గా దోచేస్తున్న..
– చుక్కపల్లి సురేష్ అండ్ గ్యాంగ్
– మూడేళ్లలో పూర్తయ్యే ప్రాజెక్ట్ కు 60 శాతం బ్లాక్ మనీ
– కస్టమర్లకు లక్షల్లో అద్దె అంటూ అరచేతిలో స్వర్గం
– రేరా అనుమతులు లేకుండానే..ప్రాజెక్టుల పూర్తి
– ఫినిక్స్ భూ ఫిక్సింగ్ పేరుతో..
– తొలివెలుగు క్రైం బ్యూరో 25 కథనాలు
హైదరాబాద్, తొలివెలుగు క్రైం బ్యూరో : ఫినిక్స్..ఒక్కసారి ఫిక్స్ అయితే చాలు.. హైదరాబాద్ లో లిటిగేషన్ ఉన్నభూముల పై గద్దలా వాలిపోతుంది.. అధికారపార్టీకి అనధికారికంగా భాగస్వామిగా ఉంటూ..అదేమంటూ అడిగిన ప్రతిపక్షాలకు గులాబీ నోట్లు కుమ్మరిస్తుంది. ఆ తర్వాతే అడిగేవాడే లేడనే ధైర్యంతో అడ్డగోలుగా రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ లు చేపడుతుంది. దటీజ్ ఫినిక్స్. ఈ దందాపై అనుమానం వచ్చిన తొలివెలుగు క్రైం బ్యూరో గత ఏడాదిగా పరిశోధించింది..ఎన్నోఆధారాలు సంపాదించింది.. ఫినిక్స్ భూ ఫిక్సింగ్ పై ఇప్పటిదాకా 25 కథనాలు వెలువరించింది.
శ్మశాన వాటికలను సైతం వదలకుండా సంపాదిస్తున్న ఫినిక్స్ సంస్థ.. ప్రభుత్వం నుంచి అక్రమ జీ.వోలు తెప్పించుకోవడంలో దిట్ట. ఇదే అంశం పై ఐటీ శాఖ నజర్ పెట్టింది. నోటీసులు జారీ చేసింది. దీంతో ఇన్నాళ్ల పాటు..పేపర్ ఎవిడెన్స్, పొజిషన్స్ తో కథనాలు ఇచ్చిన తొలివెలుగు క్రైం బ్యూరో..తాజాగా ఫిల్డ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.అసలు ఫినిక్స్ సంస్థ ఇన్నిఅక్రమాలను ఎలా కప్పిపుచ్చుకొని బిజెనెస్ చేస్తుందో .. స్టింగ్ ఆపరేషన్ చేసింది. అదికూడా అంత ఈజీగా అయిన పనేం కాదు..అడుగడుగునా ప్రాణాంతకమే..!ఎందుకంటే..రోడ్డు నెంబర్ 45 లోని ఫినిక్స్ జూబ్లీహిల్స్ ఆఫీస్ లో కాలు పెట్టాలంటే.. ఎవ్వరి తరం కాదు. ఆ కంపనీలో ఉద్యోగులు, భాగస్వాములకు మాత్రమే వెళ్లేందుకు వీలుంది. కస్టమర్స్ ఎవ్వరు వచ్చినా.. మరో సిస్టర్ సంస్థ అయిన శ్రీనిధి ఎస్టెట్ కంపెనీలోకి పంపిస్తారు. అక్కడ చూపిస్తారు అసలైన సినిమా. అవును..అచ్చం సినిమా హాల్ లా ఉండే ఓ స్క్రీన్ పై అద్భుతమైన “రియల్” పిక్చర్ మన కళ్లకు కడతారు.
మరి తొలివెలుగు క్రైంబ్యూరో..స్టింగ్ ఎలా సాగింది?
ఫినిక్స్ అక్రమాల పై నిజ నిర్ధారణకు వెళ్లింది తొలివెలుగు. గతంలో లాగా ప్రాజెక్ట్స్ వద్ద బోర్డులు పెట్టడం లేదు.అసలు ఆరు నెలలుగా ఇంకా ఎన్నిలిటిగేషన్ భూములను క్లియర్ చేసుకున్నారో చూద్దామని ప్రయత్నించింది. కానీ మెయిన్ ఆఫీస్ కి వెళ్లాలంటే పద్మవ్యూహంలో అడుగు పెట్టినట్టే. కండలు తిరిగిన వస్తాదుల్లాంటి బౌన్సర్స్ తో పాటు పుల్ టైట్ సెక్యూరిటీ. అంతేనా.. ఉద్యోగులు వేలు పెడితేనే ..అదే థంబ్ ఇంప్రెషన్ తో మాత్రమే గేట్లు ఓపెన్ అవుతాయి. పక్కా మనవాడే అనుకుంటేనే ఎంట్రీ. కానీ కస్టమర్స్ రూపంలో వెళితే శ్రీనిధి ఎస్టేట్ లోకి ఎంటర్ కావచ్చు. అసలు కథ అక్కడే మొదలయింది. 15 ప్రాజెక్ట్ ల గురించి 6 నిమిషాల విడిది వీడియో చూపించారు. ఆ తర్వాత ఒక్కొక్క ప్రాజెక్ట్ గురించి ఒక్కొక్క వీడియో వేశారు. ఇదంతా చూట్టానికి బాగానే కనిపిస్తాయ్.. కానీ ఒక్కటీ రూల్స్ ప్రకారం లేదు. భూములను అక్రమంగా,తక్కువ ధరకు కొట్టేసిన ఫినిక్స్ యాజమాన్యం..ప్రాజెక్ట్ పూర్తి కాకముందు నుంచే బ్లాక్ మనీని వైట్ గా మార్చేస్తున్నారు. ముందుగా 80 శాతం డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది. అందులో 60 శాతం బ్లాక్ మనీ నగదు రూపంలో ఇచ్చినా తీసుకుంటారు. మరోవైపు…30 శాతం తప్పని సరి బ్లాక్ మనీ కావాల్సిందేననేది ఇంకో షరతు. ఇదంతా క్రైం బ్యూరో కెమెరాలో రికార్డు అయింది.
ఎక్కడా ప్రచారం చేసుకోరే..!
ఫినిక్స్ అంటే..ప్రచారానికి పెట్టిన పేరు..ఎక్కడైనా..తన పేరు, బ్రాండ్ వాడుకోకుండా ఉండదు.చివరికి స్మశన వాటికల్లో ఆదాయంతో పాటు..అక్కడ ఇబ్బడిముబ్బడిగా బోర్డులు పెట్టేసుకుంటారు. అలాంటి ఫినిక్స్ ప్రాజెక్ట్ ల వద్ద గతంలో ఉన్నట్లు బోర్డులు లేవు. వెబ్ సైట్ లో ప్రచారం లేదు. స్పెషల్ గా వీడియోలు కనిపించవు. కేవలం వారు చూపించేందుకు మాత్రమే సినిమా స్టైల్లో తయారు చేసుకున్నవీడియోలు ఉన్నాయి. అంటే.. తొలివెలుగు దెబ్బకు తోక ముడిచినా … తన దందా మాత్రం ఆపలేదు. చేసే తతంగం అంతా సైలెంట్ గా చేస్తున్నారని తెలుస్తోంది. ఇదే అంశాన్నిస్టింగ్ ఆపరేషన్ లో సంస్త సిబ్బంది సైతం అంగీకరించారు.
కమర్షియల్ స్పేస్ దందా!
హైదరాబాద్ లో కమర్షియల్ స్పేస్ దందా పెద్ద ఎత్తున నడుస్తోంది. ఒక్కసారి అమ్మకం జరిపిన తర్వాత ఓనర్ దానిని ఎలాగైనా వాడుకోవచ్చు లేదా అమ్ముకోవచ్చు.కాని ఇక్కడ అలా కాదు..డబ్బులు పెట్టి కొనుగోలు చేసినా పెత్తనం అంతా వారిదే. ఇదంతా కేవలం బ్లాక్ మనీ ఉన్నవారు మాత్రమే చేసుకోగలిగే దందా.. అందుకే ఫినిక్స్ దందా అంతా.. కమర్షియల్ కాంప్లెక్స్ స్పేస్ అంటూ.. ఇప్పటి వరకు మూడు కోట్ల అడుగుల నిర్మాణాన్ని పూర్తి చేసింది. మరో కోటి అడుగుల నిర్మాణం జరుగుతోంది. కొత్త ప్రాజెక్ట్ లతో మరో కోటి అడుగులు నిర్మించేందుకు పావులు కదుపుతోంది. ఇదంతా.. రియల్ ఎస్టేట్ చట్టాలకు వ్యతిరేకంగానే.
అతి అరాటమే కొంప ముంచుతోందా..? తొలివెలుగు క్రైంబ్యూరో రాబోయే కథనంలో గుట్టు రట్టు చేసే అంశమిదే. ప్రభుత్వం భూమి క్లియర్ చేస్తామని చెప్పుకుంటూ.. భారానికి మించి ప్రాజెక్ట్ లను చేస్తుండటంతో ఏం జరుగుతోంది..!అన్ని పక్షాలకు సమన్యాయం చేయడంతో చివరికి ఏం మిగులుతోందో.. 26 వ కథనంలో చూద్దాం.