ఎదురుగా పచ్చి గడ్డి వేసి చిక్కం కడితే గుర్రం ఏమి చేస్తుంది ? ఆకలి దండిగా ఉన్నప్పుడు మేత వద్దంటే ఎలా ఉంటుంది ? ఇదీ వైసీపీలో బాగా అవినీతి ఆకలితో ఉన్న అమాత్యుల పరిస్థితి. సీఎం జగన్‌పై ఇప్పటికే ఎన్నో అవినీతి అభియోగాలున్నాయి. అవన్నీ కక్షపూరితంగా బనాయించినవేనని జగన్ వాదం. ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీకి అధికారం వచ్చింది. జనానికి తాను చాలా క్లీన్, నో కరప్షన్ అనే మెసేజ్ ఇప్పటికే ఇచ్చేశారు. ఇలాంటి సమయంలో అధికారం వచ్చినా అవినీతి గడ్డి కరవక పొతే ఎలా? అని కొందరి సనుగుడు.
ఇక అసలు విషయానికి వస్తే గోదావరి జిల్లాకు చెందిన ఒక మహిళా మంత్రి ఎంచక్కా ఈ పవర్ ద్వారా వచ్చిన పరపతిని కాస్త క్యాష్ చేసుకునే పనిలో పడ్డారు. కొన్ని బదిలీలు చేయించడానికి కాస్త ఖర్చవుతుందని కొందరికి మహిళా మంత్రి చెప్పారట. పైగా తన భర్తకు కలెక్షన్ల బాధ్యతను అప్పగించారట. ఈ డీల్ సరిగ్గా అమలు జరుగుతున్నప్పుడే ఆ మహిళా మంత్రికి ఒక్క ఫోన్ కాల్ వచ్చింది.. అంతే..!! అమ్మగారికి షాక్.
“11 లక్షలు చెక్కా, క్యాషా? మేడం గారు” అనే మాటలు వినగానే ఆ మహిళా మంత్రి ప్రాణం పోయినంత పనయిందట. ఇంతకూ ఆ ఫోన్ కాల్ సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ నుంచి కావడం, పై డైలాగు వినపడటంతో దాదాపుగా ప్రాణాలు పైపైనే పోయినంత పనయ్యిందనీ వైసీపీ వర్గాల సమాచారం.
ఆ మహిళా మంత్రి సర్దుకుని “అది కాదు, ఆలా జరగలేదు” అని సీఎంకు సర్ది చెప్పుకునేసరికి దాదాపుగా తలప్రాణం తోకకొచ్చిందట. ఆ తరవాత జగన్ ఆమెకి బానే క్లాస్ పీకారంట!
“మీ పిల్లల పెళ్లిళ్లు, చదువులు, ఇలా ఇంట్లో ఎలాంటి ఖర్చులు ఉన్నా డైరెక్టుగా నాకు కాల్ చేసి చెప్పండి, నేను చూసుకుంటాను. అంతేకానీ ఇలా వసూళ్లు మొదలుపెట్టొద్దు”, అని జగన్ హితవు పలికారని వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
జగన్ ఎందుకు ఇలా చేశారంటే, దీనిపై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. గతంలో జగన్ మీద విపరీతమైన అవినీతి ఆరోపణలు వున్నాయి. టీడీపీ అప్పట్లో ఈ అవినీతిపై పుస్తకాలూ విడుదల చేసింది. ఆ ఇమేజ్ నుంచి బయటపడే ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తోంది. అందులో భాగంగానే ఈ 11 లక్షల ఫోన్ కాల్ కూడా వచ్చిందని తెలుస్తోంది.
అయితే రూలింగ్ పార్టీ లీడర్లకు ఈ పరిస్థితులు కాస్త వింతగానూ, కష్టంగా ఉన్నాయి. ఇన్నేళ్ల అవినీతి ఆకలి తరవాత అధికారం వస్తే, సైలెంట్‌గా కూర్చోమంటే ఎలా? అని కొందరు తెగ బాధపడుతున్నారు. మరికొంతమంది అయితే, “సరే మా ఖర్చులు, బాధ్యతలు అన్ని ఆయన చూసుకుంటానని అంటున్నారు కదా? మరి ఆయనకి డబ్బులు ఎక్కడనుంచి వస్తాయి? మేము చేసినా అవే కాంట్రాక్టులు, మీరు చేసినా అదే దందా కదా?” అని సీక్రెట్‌గా నిట్టూరుస్తున్నారు. “అన్ని డీసెంట్రలైజ్డ్ కావాలంటారు, ఈ క్యాష్ సెటిల్‌మెంట్లు మాత్రం సీఎంఓ చుట్టూ మాత్రమే కేంద్రీకృతం కావాలా”, అని తెగ బాధపడిపోతున్నారు.