టీలో పంచదార తక్కువైందని పంచాయతీ పెట్టుకునే జంటలెన్ని లేవు..! కూరలో ఉప్పు ఎక్కువైందని విడాకుల దాకా వెళ్ళిన దంపతులెందరు లేరు.! సంవత్సరాల తరబడి ప్రేమించుకుని నెలతిరక్కుండా ఎవరిదారి వారుచూసుకున్న ప్రేమపక్షులు ఎన్ని లేవు. దాంపత్యం అంటే వయసులో ఉండగా ఎగసిపడేది కాదు. వయసు మళ్ళాకా కూడా తోడు ఉండే బంధం. కట్టెకాలే దాకా వెంటనడిచే అనుబంధం.అలాంటి ఓ జంట ఇప్పడు నెట్టింట వైరల్ అయ్యింది.
అన్యోన్యంగా ఉన్న ఓ వృద్ధ జంట స్వీట్, క్యూట్ వీడియోను ఫొటోగ్రాఫర్ సుతేజ్ సింగ్ పన్ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియోలో పెద్దవయసున్న సిక్కు దంపతుల కెమిస్ట్రీ నెటిజన్లు ఆకట్టుకుంటోంది. ఇన్‌స్టాగ్రాంలో ఈ వీడియోను పన్ను షేర్ చేశారు. ఈ క్లిప్‌లో మొదట టీ తాగుతున్న జంట వైపు పన్ను నడుచుకుంటూ రావడం కనిపిస్తుంది.
తన కెమెరాలో వారి ఫొటోలు తీసుకునేందుకు పన్ను వృద్ధ జంట అనుమతిని కోరతాడు. వారు అంగీకరించడంతో ఫొటోలు తీసి వారికి చూపించడంతో వెనువెంటనే ఫొటోలు ప్రింట్ అవడంపై పెద్దాయన ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ మరికొన్ని ఫొటోలు తీయాలని కోరతాడు.
ఈ వీడియోను ఆన్‌లైన్‌లో షేర్ చేసినప్పటి నుంచి ఇప్పటివరకూ 8 లక్షల మందికి పైగా వీక్షించారు. వృద్ధ దంపతుల మధ్య స్వచ్ఛమైన ప్రేమకు నెటిజన్లు ఫిదా అయ్యారు. రాపర్ బాద్షా కూడా ఈ పోస్ట్‌పై స్పందించారు.
రీల్స్, సెల్పీలకే ప్రేమ పరిమితమైన రోజుల్లో ఈ జంట సింపుల్ లవ్ ఎలా ఉంటుందో వెల్లడించారని కామెంట్ చేశారు. ఫొటోను చూసి వారు నిజాయితీగా మురిసిపోవడం చూస్తుంటే మన గ్రాండ్‌పేరెంట్స్ ఎలా జీవించారనేది తెలుస్తుందని రాసుకొచ్చారు.