కరోనా వేరియంట్ ఒమిక్రాన్ కారణంగా దేశంలో మూడో వేవ్ ప్రభావం కనపడుతోంది. అయితే సెకండ్ వేవ్ డెల్టా వేరియంట్ కు.. థర్డ్ వేవ్ ఒమిక్రాన్ కు మధ్య ఉన్న ప్రధాన తేడా ఏమిటి అనేది వైద్యులు విశ్లేషణ చేస్తున్నారు. దీనికి సంబంధించి దగ్గు స్వభావంతో ఒమిక్రాన్, డెల్టాను గుర్తించవచ్చని ఏఐజీ హాస్పిటల్స్ వైద్యులు గుర్తించారు. తెలిసిన పరిశోధనలు, వారు చికిత్స పొందిన రోగుల వ్యక్తిగత పరిశీలనల ఆధారంగా చాలా మంది డెల్టా వేరియంట్ ప్రభావిత రోగులు పొడి దగ్గుతో బాధపడుతున్నారని వెల్లడించారు. ఒమిక్రాన్ బాధితులు తడి దగ్గుతో బాధతపడుతున్నారని గుర్తించారు.
ఎక్కువ కేసుల్లో ఈ పోలిక ఉందని వైద్యులు చెప్తున్నారు. దీనిపై ఏఐజీ హాస్పిటల్స్ లోని కన్సల్టెంట్ ఇంటర్నల్ మెడిసిన్ డాక్టర్ కేతన్ మష్రా స్పందించారు. ఎక్కువ మంది రోగుల్లో కనిపించిన లక్షణాల ఆధారంగా ఈ విషయం గుర్తించామన్నారు. కండ్ల కలక, వాసన కోల్పోవడం, నాడీ సంబంధ లక్షణాలు డెల్టా వేరియంట్ లో ఎక్కువగా కనపడ్డట్టు వైద్యులు చెప్తున్నారు. రోగికి చికిత్స చేయడానికి ఈ రకమైన లక్షణాలను నిశితంగా పరిశీలించడం చాలా అవసరం అని వైద్యులు తెలిపారు.
డెల్టా అయితే.. శరీరంపై వ్యక్తీకరణ మరింత తీవ్రంగా ఉంటోంది. ఒమిక్రాన్ అయితే చికిత్స మరో రకంగా ఉంటుంది. కాబట్టి లక్షణాలను నిశితంగా పరిశీలించాలని వైద్యులు సూచిస్తున్నారు. వేరియంట్ సోకినవారికి కండరాల నొప్పితో పాటు 1-2 రోజులు అలసిపోయినట్లు అనిపిస్తుందని తెలిపారు.
ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా గొంతు నొప్పి, తలనొప్పి, ఛాతీ నొప్పి ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. ఒమిక్రాన్ వేరియంట్ సోకిన వారికి తలనొప్పి, శరీరంలో నొప్పి వంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. వ్యాక్సిన్ తీసుకోని వారు ఎక్కువగా ఒమిక్రాన్ వేరియంట్ బారిన పడుతున్నారు. దేశంలో మళ్లీ మూడో వేవ్ ఉధృతి కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ముంబయిలోని జస్లోక్ ఆస్పత్రి వైద్యు డు డాక్టర్ సంజయ్ నాగ్రాల్, కేరళలోని రాజ్గిరి ఆస్పత్రికి చెందిన డాక్టర్ సిరియక్ ఫిలిప్, బెంగళూరుకి చెందిన డాక్టర్ రాజనీ భట్, యూఎస్, కెనడాకు చెందిన మరికొందరు భారతీయ వైద్యులు సహా మొత్తం 32 మంది వైద్యులు ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ లేఖలు పలు కీలక అంశాలను ప్రస్తావించారు. కరోనా విషయంలో సెకండ్ వేవ్ సమయంలో చేసిన తప్పులే ఈ ఏడాదిలోనూ పునరావృతమవుతున్నాయని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా చికిత్స విధానంలో మార్పులు అవసరం అని వారు అభిప్రాయ పడ్డారు.