జీ7 సమ్మిట్ కోసం జర్మనీ వెళ్లిన ప్రధాని మోడీ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మ్యూనిచ్ లో ప్రధాని విమానం దిగుతుండగా తీసిన ఈ ఫోటో తెగ ఆకట్టుకుంటోంది. మై గవర్నమెంట్ ఇండియా ట్విట్టర్ లో ఈ ఫోటోను పోస్ట్ చేసింది.
ఫోటోలో మోడీ మెట్లు దిగివస్తుండగా.. పైన ఆకాశంలో ఇంద్రధనస్సు కనిపించింది. “1.3 బిలియన్ల భారతీయుల నాయకుడికి ప్రకృతి స్వాగతం” అంటూ మై గవర్నమెంట్ ఇండియా క్యాప్షన్ ఇచ్చింది. దీనిపై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు.
బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా ఈ ఫోటోకు కామెంట్ చేశారు. “ప్రకృతి కూడా తనను తాను నిలువరించలేకపోయింది” అని అన్నారు. ఇతర నెటిజన్లు కూడా చాలా అద్భుతంగా ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట చక్కర్లు కొడుతోంది.
ఇటు మూడు రోజుల పర్యటన కోసం ప్రధాని జర్మనీ వెళ్లారు. ముందుగా అక్కడ ప్రవాస భారతీయులను కలిశారు. ఐటీ రంగం మొదలు డిజిటల్ టెక్నాలజీ వరకు ఏ రంగంలోనైనా భారత్ అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని అన్నారు. కోట్లాది మంది భారతీయులు కలిసికట్టుగా పనిచేసి గొప్ప లక్ష్యాలను సాధిస్తున్నారని తెలిపారు. ఇలాంటి చైతన్యం గతంలో తాను ఎప్పుడూ చూడలేదుని.. నేడు అన్ని గ్రామాలు బహిరంగ మల విసర్జన రహిత గ్రామాలుగా మారాయని వివరించారు.