ఏపీలో ఓ పావురం కలకలం రేపింది. అల్లూరు సీతారామ రాజు జిల్లా యటపాక మండలం గొల్లగూడెంలో కాలుకు ట్యాగ్ ఉన్న పావురం ఒకటి స్థానికులకు కనిపించింది. దీంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. దీనిపై పలు అనుమానాలు, ఊహాగానాలు మొదలయ్యాయి.
పావురం సమాచారాన్ని మత్స్యకారులు పోలీసులకు అందించారు. ఇంటి మీద పావురం వాలడంతో దాన్ని పట్టుకున్నామన్నారు. తీరా చూస్తే దాని కాలుకు ట్యాగ్ వేసి ఉందని మత్స్యకారులు తెలిపారు. పావురం కాలుకు జీపీఎస్ ట్యాగ్ ఉండటంతో చర్చనీయాంశంగా మారింది.
సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల పావురాల పందేలను నిర్వహిస్తున్నారు. పందేళ్లో భాగంగా పావురాల కాళ్లకు ట్యాగ్ లు కట్టి వదులు తున్నారు. ట్యాగ్ ల ఆధారంగా ఏ పావురం గమ్యస్థానాన్ని చేరుకుందో అంచనా వేస్తారు.
దాని ఆధారంగా పావురాన్ని, దాని యజమానులను విజేతలుగా ప్రకటిస్తారు. ఈ పందేల్లో కోట్ల రూపాయలు చేతులు మారుతున్నట్టు తెలుస్తోంది. దీంతో ఈ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ మేరకు పావురాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు సమాచారం.