రాజకీయ వేడి పుట్టించిన జీహెచ్‌ఎంసీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. శుక్రవారం ఎన్నికల ఫలితాలు ప్రకటించబోతున్నారు. దీంతో మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో ఎక్స్ అఫీషియో ఓటర్లుగా ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకు ఓటు హక్కు అత్యంత కీలకం కానుంది. అన్ని పార్టీలు పోటాపోటీగా సీట్లు గెలిస్తే… ఎక్స్ అఫిషియో ఓట్లే కీలకం. దీంతో వారికి ఓటు హక్కు కల్పించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. బాల్కొండ మాజీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్ ఈ పిల్‌ను దాఖలు చేశారు.
ఓటింగ్‌లో ఎక్స్ అఫీషియో సభ్యులు పాల్గొనడం ద్వారా మెజార్టీ సభ్యుల పాలన జరగాలనే ప్రజాస్వామ్య స్ఫూర్తిని నీరుగార్చేలా ఉందంటూ ఈ పిటిషన్ వేశారు. జీహెచ్‌ఎంసీలో మాత్రమే ఇంత పెద్ద సంఖ్యలో చట్టసభ సభ్యులు ఓటు వేసే అవకాశం ఉందని, ఇది జీహెచ్‌ఎంసీ యాక్ట్ 1955లోని సెక్షన్ 90(1) చట్ట వ్యతిరేకమని పిటిషనర్ కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ ఎక్స్ అఫిషియో ఓట్లలో పరిమితి ఉండాలని కోరారు. పిటిషన్‌లో చీఫ్ సెక్రటరీ, మున్సిపల్, న్యాయ శాఖ ముఖ్య కార్యదర్శులు, స్టేట్ ఎలక్షన్ కమిషన్, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ను ప్రతివాదులుగా పేర్కొన్నారు.
దీంతో మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక హైకోర్టు పరిధిలోకి వెళ్లిపోయింది.