ప్రజా ప్రయోజన వ్యాజ్యాల దుర్వినియోగంపై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఆందోళన వ్యక్తం చేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల, ముఖ్యమంత్రుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… కొందరు పిల్( పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్)ను పర్సనల్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ గా మారుస్తు వాటిని వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడం బాధాకరమన్నారు.
ఈ రోజుల్లో రాజకీయ ప్రయోజనాలను నెరవేర్చుకోవాలనుకునే వారికి, కార్పొరేట్ శత్రుత్వాన్ని పరిష్కరించుకోవాలనుకునే వారికి పిల్ ఒక ఆయుధంగా మారిందన్నారు. అందువల్ల ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై దర్యాప్తు జరిపేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని ఆయన సూచించారు.
న్యాయమూర్తులు తమ కర్తవ్యాన్ని నిర్వహించే సమయంలో తమ లక్ష్మణరేఖను గుర్తుంచుకోవాలన్నారు. కోర్టులు ఇచ్చిన ఆదేశాలను కొన్ని ప్రభుత్వాలు పాటించడం లేదని, దీంతో కోర్టు ధిక్కరణ కేసులు ఇటీవల పెరుగుతున్నాయన్నారు.
ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు అంత ఆరోగ్యకరం కాదన్నారు. న్యాయవ్యవస్థ బలోపేతానికి కొన్ని చర్యలు అవసరముందన్నారు. న్యాయ వ్యవస్థలో మౌలిక వసతులను త్వరితగతిన ఏర్పాటు చేయాలన్నారు. కేసుల పరిష్కారానికి మరింత సిబ్బంది అవసరమన్నారు. మానవ వనరుల సమస్య తీరితే కోర్టులపై భారం తగ్గుతుందని ఆయన తెలిపారు.
మూడు వ్యవస్థల మధ్య అధికారాల విభజనను రాజ్యాంగం అందించిందన్నారు. మూడు వ్యవస్థల మధ్య సామరస్య పనితీరు ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తుందన్నారు. చట్టం ముందు అందరూ సమానమేనని, బాధితులందరికీ న్యాయం అందించడంలో అది అంతర్భాగంగా ఉంటుందన్నారు.