తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నూతన సెక్రటేరియట్ లో ఇటీవల జరిగిన అగ్నిప్రమాదంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. అంతేకాకుండా తాను దాఖలు చేసిన పిల్ ను విచారణకు రాకుండా అడ్డుకుంటున్నారని చీఫ్ జస్టిస్ బెంచ్ కి విన్నవించారు.
పాల్ దాఖలు చేసిన పిల్ కు నెంబరింగ్ ఇవ్వాలని రిజస్టార్ కి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో పాల్ వేసిన పిల్ మంగళవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది.
కాగా ఫిబ్రవరి 3వ తేదీన నూతన సచివాలయంలో అగ్ని ప్రమాదం సంభవించింది. అలాగే సెక్రటేరియట్ ను సీఎం కేసీఆర్ పుట్టిన రోజున ప్రారంభించడం అన్యాయమని.. అంబేద్కర్ జయంతి ఏప్రిల్ 14న ప్రారంభించేలా ఆదేశాలివ్వాలని కోరుతూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు.
కేసీఆర్ పుట్టినరోజు అయిన ఫిబ్రవరి 17న సచివాలయం ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని, వాటిని అడ్డుకోవాలని కోరారు. జాతి అభివృద్ధి కోసం పౌరులు చెల్లిస్తున్న పన్నులను దుర్వియోగం చేస్తూ.. అప్పటికే ఉన్న సచివాలయాన్ని వాస్తు పేరిట కూల్చి కొత్తది నిర్మించారని పాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.610 కోట్లతో కొత్తగా నిర్మించిన భవనాన్ని తన పుట్టినరోజు ప్రారంభించడం ద్వారా సీఎం వ్యక్తిగత ప్రచారం పొందాలని చూస్తున్నారని ఆరోపించారు కేఏ పాల్.