కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవంపై పాలక, విపక్షాల మధ్య తీవ్ర రాజకీయ వివాదం తలెత్తిన వేళ.. సుప్రీంకోర్టులో ఓ ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలయింది. నూతన పార్లమెంట్ భవనాన్ని రాష్ట్రపతి ప్రారంభించేలా లోక్ సభ సచివాలయానికి, కేంద్రానికి ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ సుప్రీంకోర్టుకే చెందిన సి.ఆర్. జయ సుఖిన్ అనే న్యాయవాది కోర్టులో పిల్ దాఖలు చేశారు. రాష్ట్రపతిని ఆహ్వానించకుండా కేంద్రం ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోవడం భారత రాజ్యాంగాన్ని అతిక్రమించినట్టే అవుతుందని ఆయన అన్నారు.
పార్లమెంట్ ఇండియాకు అత్యున్నతమైన లెజిస్లేటివ్ సభ అని, లోక్ సభ, రాజ్యసభ, రాష్ట్రపతితో కూడినదే పార్లమెంట్ అని ఈ లాయర్ పేర్కొన్నారు. లోక్ సభను గానీ, రాజ్యసభను గానీ ప్రోరోగ్ చేసే అధికారంతో బాటు పార్లమెంటును రద్దు చేసే అధికారాలు కూడా రాష్ట్రపతికి ఉన్నాయని జయ సుఖిన్ అన్నారు.
కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించేందుకు రాష్ట్రపతిని కేంద్రం ఆహ్వానించకపోవడం సరికాదన్నారు. దీని శంకుస్థాపనకు కూడా ప్రెసిడెంట్ ను ఆహ్వానించలేదన్నారు.
ప్రధానిని రాష్ట్రపతి నియమిస్తారని, ప్రధాని సలహాపై మంత్రులను కూడా రాష్ట్రపతి నియమిస్తారని, అలాగే గవర్నర్లు, జడ్జీలను, సీఈసీని, ఇతరఎలెక్షన్ కమిషనర్లను కూడా నియమించే అధికారం రాష్ట్రపతికి ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ పిల్ పై కోర్టు శుక్రవారం విచారణ జరపనుంది.