గ్రేటర్ హైదరాబాద్ మేయర్ పీఠంపై ఉత్కంఠ నెలకొంది. ఫిబ్రవరి 11న మేయర్ ఎన్నిక ఉంటుందని ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ లేని సమయంలో… మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు అధికార టీఆర్ఎస్ పార్టీకి ఎక్స్‌అఫిషియో ఓట్లు కలిసి వచ్చే వీలుంది.
దీంతో ఈ ఎన్నికలో ఎక్స్అఫిషియో ఓట్లు అనుమతించవద్దంటూ హైకోర్టులో పిల్ దాఖలైంది. ఈ వ్యాజ్యంపై హైకోర్టు విచారణ చేపడుతుంది. మాజీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ ఈ పిల్ దాఖలు చేశారు. ఎక్స్‌అఫిషియో ఓట్లకు అనుమతించే జీహెచ్‌ఎంసీ చట్టంలోని సెక్షన్ 90(1)ను ఆయన సవాలు చేశారు. ఈ సెక్షన్‌ను చట్ట, రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించి కొట్టివేయాలని పిటిషన్ లో కోరారు. ఎక్కువ కార్పొరేటర్ సీట్లు గెలిచినప్పటికి ఎక్స్‌అఫిషియో ఓట్ల వలన మేయర్ ను ఎన్నుకోలేక పోతున్నారన్నారని పిటీషన్ లో వాదించారు.
ప్రస్తుతం జీహెచ్‌ఎంసీలో ఉన్న 150 వార్డుల్లో 55 మంది ఎక్స్‌అఫిషియో ఓట్లున్నాయి. మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో 55 మంది ఎక్స్ అఫిషియో సభ్యులు ఓటు వేయనున్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు ఎక్స్‌అఫిషియో ఓటింగ్ కల్పించడం ద్వారా స్థానిక ప్రజల ఉద్దేశం నీరుగారిపోతుందని హైకోర్టును అభ్యర్థించారు.