తిరుమలలో గదుల అద్దెల పెంపును నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా భాారతీయ జనతా పార్టీ ఆందోళనలు చేయనుంది. జిల్లా కలెక్టర్ కార్యాలయాల ఎదుట కార్యకర్తలు నిరసన ప్రదర్శనలు నిర్వహించి కలెక్టర్లకు వినతిపత్రాలుఅందచేయనున్నారు.తిరుమలలో శ్రీవారి దర్శనం సామాన్యులకు భారంగా పరిణమించింది. తిరుమల కొండపై గది అద్దెను భారీగా పెంచడంతో ఆ భారం భక్తులపై పడుతోంది. నిన్న మొన్నటి వరకు రూ.150 ఉన్న గది అద్దెను ప్రస్తుతం రూ.1,700కు పెంచారు. రూ.200 ఉన్న పెద్ద గది అద్దె రూ.2,200కు పెంచారు.
తిరుమలలో వేంకటేశ్వరస్వామిని దర్శించుకోవాలని ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి తిరుమల చేరుకునే భక్తులపై ఇటీవల టీటీడీ భారం మోపింది. భక్తులకు లాభాపేక్ష లేకుండా సౌకర్యాలు కల్పించాల్సిన దేవస్థానం గదుల అద్దెలు పెంచడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది.
రాష్ట్రంలో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్ర ప్రభుత్వం, టీటీడీ పాలకమండలి భక్తుల నుంచి వసూలు చేసే ఛార్జీల పెంపుపైనే ఎక్కువ దృష్టి పెట్టిందనే విమర్శలు ఉన్నాయి. ఇప్పటికే లడ్డూ సహా ప్రసాదాల ధరలు పెంచి భక్తులపై భారం మోపిన టీటీడీ తిరుమల కొండపై ఉన్న అతిథి గృహాల్లో గదుల ధరల్నీ భారీగా పెంచడంపై ఆందోళన వ్యక్తమవుతోంది.
గతంలో శ్రీవారి ఆర్జిత సేవల టికెట్ల పెంపు వ్యవహారం లైవ్‌లో ప్రసారం కావడం వివాదాస్పదం అయ్యింది. ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ధరల పెంపుపై చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వ్యక్తమవడంతో ఆ ప్రతిపాదనల్ని టీటీడీ విరమించుకుంది. ఆ తర్వాత గదుల అద్దెలు పెంచడం, భక్తులకు ఉచితంగా ఇచ్చే లడ్డూల సంఖ్యను కుదించడం, ప్రసాదం ధరల పెంపు లాంటి చర్యలకు పాల్పడిందనే ఆరోపణలు ఉన్నాయి.
తిరుమలలో ఆర్జితసేవా టికెట్ల ధరలు ఎంత పెంచినా సామాన్యులకు ఇబ్బంది ఉండదు. వాటిని కొనేవారిలో ఆర్థిక స్తోమత, పలుకుబడి గలవారే ఎక్కువ మంది ఉంటారు. మరోవైపు గదుల అద్దెల పెంపు భారం ఎక్కువగా సామాన్యులు, మధ్యతరగతి, దిగువ మధ్య తరగతిపైనే పడుతోంది. టీటీడీ లగ్జరీ కాటేజీల ధరలను పెంచి, సామాన్యులపై భారం లేకుండా చూసే అవకాశాలు ఉన్నా టీటీడీ వాటిని పరిశీలించడం లేదు.
3వేల కోట్లకు పైగా వార్షిక బడ్జెట్ ఉన్న టీటీడీ సామాన్య భక్తులపై భారాన్ని మోపేలా గదుల అద్దె పెంచుతోందని విమర్శలు ఉన్నాయి. తిరుమల కొండపై సామాన్య, మధ్యతరగతి వర్గాలకు అందుబాటులో ఉండే ఎస్వీ, నారాయణగిరి అతిథి గృహాల్లో గదుల అద్దెలను రూ.150 నుంచి రూ.1,700కి పెంచడం ప్రజలపై పెనుభారం అని బీజేపీ విమర్శిస్తోంది. అద్దె ధరల్ని ఒకేసారి 1133% పెంచడం ఎలా సమర్థించుకుంటారని ప్రశ్నిస్తోంది.
తిరుమలలోని అతిథి గృహాలు, కాటేజీల్లో వివిధ కేటగిరీల గదులు సుమారు 7,200 ఉన్నాయి. వాటిలో ఒక గది రోజువారీ అద్దె… ఎస్‌ఎంసీ, ఎస్‌ఎన్‌సీ, ఏఎన్‌సీ, హెచ్‌వీసీల్లో 50 రుపాయలు, రాంబగీచా, వరాహస్వామి గెస్ట్‌హౌస్, ఎస్‌ఎన్‌జీహెచ్, హెచ్‌వీడీసీ, ఏటీసీ, టీబీసీల్లో రూ.100, నారాయణగిరి, ఎస్వీ గెస్ట్‌హౌస్‌లలో రూ.150, విష్ణు పాదంలో రూ.250, వకుళమాత, కౌస్తుభం, పాంచజన్యం, నందకం అతిథి గృహాల్లో రూ.500 చొప్పున ఉండేవి.
ఇటీవల నందకం, పాంచజన్యం, కౌస్తుభం, వకుళమాత అతిథి గృహాలలో గదుల ధరల్ని రూ.వెయ్యికి పెంచేశారు. ఎస్వీ అతిథి గృహంలో 31 గదులుండగా, వాటి అద్దెను రూ.150 నుంచి రూ.1700 చేశారు. తాజాగా నాలుగు నారాయణగిరి అతిథి గృహాల్లోని 164 గదుల అద్దెలనూ పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు. సామాన్యులకు తిరుమలలో గదులు అందుబాటులో లేకుండా అద్దెలు పెంచడాన్ని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ ఆందోళనలకు పిలుపునిచ్చింది.