అదుపు తప్పిన శిక్షణా విమానం ఓ ఆలయ శిఖరానికి ఢీకొట్టి కుప్పకూలిన ఘటన మధ్యప్రదేశ్ లోని రేవాజిల్లాలో జరిగింది. ప్రమాదంలో పైలట్ మరణించగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.
శుక్రవారం ఉదయం ప్రైవేట్ శిక్షణ విమానం రేవా జిల్లాలోని ఉమ్రి గ్రామంలో ఉన్న ఓ ఆలయ శిఖరానికి ఢీకొట్టి కుప్పకూలింది. దీంతో విమానం నడుపుతున్న పైలట్ అక్కడికక్కడే మృతిచెందగా, ట్రైనర్ తీవ్రంగా గాయపడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. విమాన శకలాల నుంచి వారిని వెలికితీశారు. క్షతగాత్రుడిని సంజయ్ గాంధీ దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని అధికారులు తెలిపారు.