రష్యాకు ఉక్రెయిన్ సేనలు ధీటైన సమాధానం ఇస్తున్నాయి. ఈ యుద్ధంలో ఉక్రెయిన్ సేనలు ప్రాణాలకు తెగించి వీరోచితంగా పోరాడుతున్నారు. ఇప్పటికే రష్యా క్షిపణి దాడుల్లో దాదాపు వేలాది మంది సైనికులు మరణించారు. చాలా మంది గాయపడ్డారు.
కానీ ఉక్రెయిన్ సైన్యం మాత్రం ఎక్కడా వెనకడుగు వేయడం లేదు. తాజాగా ఉక్రెయిన్ కు చెందిన సైనికుడు ఒకరు ముఖం నిండా రక్తంతో విజయ సంకేతం చూపిస్తూ ఓ సెల్ఫీ ఫోటోను తీసుకున్నాడు. దాన్ని ఈ నెల 5న ఉక్రెయిన్ రక్షణ మంత్రిత్వ శాఖ ఆన్‌లైన్‌లో షేర్ చేసింది.
మేజర్ వాదిమ్ వొరోషిలోవ్ మిగ్ యుద్ధ విమానాలు నడుపుతారని పేర్కొంది. యుద్దంలో రష్యాకు చెందిన 2 క్షిపణులు, ఇరాన్‌కు చెందిన 5 సూసైడ్ డ్రోన్లను ఆయన నేల మట్టం చేశారని పేర్కొంది. యుద్దంలో ముఖమంతా రక్తపు మరకలతో తీసుకున్న అతని ఫొటో ఆన్‌లైన్‌లో వైరల్ అవుతోందని వెల్లడించింది.
అక్టోబర్‌లో శత్రుదేశాల క్షిపణులు, డ్రోన్లను మిగ్ యుద్ధ విమానం నుంచి కూల్చే క్రమంలో వాదిమ్ వొరోషిలోవ్ తీవ్రంగా గాయపడ్డాడు. చివరి డ్రోన్‌ను నేలమట్టం చేస్తున్న సమయంలో ఆయన తలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతనికి ముఖమంతా రక్తం అంటుకుంది.
అయినప్పటికీ ఆయన చిరు నవ్వులు చిందిస్తూ విజయ సంకేతం చూపిస్తూ సెల్ఫీ దిగాడు. ఆ ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పెట్టాడు. యుద్ధంలో అతను చూపిన ధైర్య సాహసాల్ని ఆ దేశ ప్రజలు మెచ్చుకుంటూ కామెంట్లు పెట్టారు. ఆ వీర సైనికుడికి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ హీరో ఆఫ్ ఉక్రెయిన్, ఆర్డర్ ఆఫ్ ది గోల్డ్ స్టార్ అవార్డులను ప్రకటించారు.