యూపీలోని ఘజియాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. కార్పొరేషన్ పరిధిలో పిట్ బుల్, రోట్ వీలర్, డోగో అర్జెంటినో జాతి శునకాలను ఇండ్లల్లో పెంచుకోవడంపై నిషేధం విధించింది. ఇటీవల ఆయా జాతుల శునకాల దాడులు ఎక్కువవుతున్న క్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ ఈ నిర్ణయం తీసుకుంది.
ఈ మేరకు మున్సిపాలిటీ పరిధిలోని పెట్స్ యజమానులకు మార్గదర్శకాలను విడుదల చేసింది. శునకాలను పెంచుకునే వ్యక్తులు మున్సిపాలిటి నుంచి లైసెన్స్ తీసుకోవాలని ఆదేశించింది. ఏ కుటుంబం గానీ ఒకటి కంటే ఎక్కువ కుక్కలను పెంచుకోరాదని తెలిపింది.
వచ్చే నెల 1 నుంచి శునకాలకు లైసెన్సులు జారీ చేయనున్నట్టు వెల్లడించింది. అపార్ట్ మెంట్లలో ఉండే వ్యక్తులు తమ కుక్కలను బయటకు తీసుకు వెళ్లే సమయంలో సర్వీస్ లిఫ్టులను ఉపయోగించాలని సూచించింది. పబ్లిక్ స్థలాల్లోకి వెళ్లినప్పుడు కుక్క మూతిని కవర్ చేయాలని పేర్కొంది.
ఇటీవల పలు కాలనీల్లో కుక్కలు దాడి చేసిన ఘటనలు ఎక్కువగా నమోదవుతున్నాయి. కుక్కల దాడిలో ఇటీవల పది మంది పిల్లలు గాయాలపాలయ్యారు. సంజయ్ నగర్ కాలనీలో కుష్ త్యాగి అనే బాలుడిపై పిట్ బుల్ శునకం దాడి చేయగా బాలుడికి 150 కుట్లు పడ్డాయి.