వేములవాడలో బ్రిడ్జి కూలిన ఘటనపై హైకోర్టులో పిల్ దాఖలైంది. హైకోర్టు న్యాయవాది రాం ప్రసాద్ ఈ పిల్ దాఖలు చేశారు. ఆరు నెలల కాలంలో ఒకే బ్రిడ్జి, రెండు సార్లు కూలిపోయిందని పిల్‌లో పేర్కొన్నారు. సరైన ప్లానింగ్ లేకుండా ఇష్టమొచ్చినట్లు బ్రిడ్జి నిర్మాణం చేపట్టారని..ప్రజా సొమ్మును వృధా చేస్తున్నారని పిటిషన్లో ఆయన ఆరోపించారు.
బ్రిడ్జి కూలిపోయిన రెండుసార్లు కాంట్రాక్టర్లు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకున్న విషయాన్ని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు.. బ్రిడ్జి కూలిపోవడానికి కారణమైన వారిని ప్రతివాదిగా చేర్చింది. వచ్చే బుధవారం పిటిషన్ ను విచారించనుంది.
వేములవాడలోని మూలవాగుపై ప్రభుత్వం రెండు బ్రిడ్జిలను నిర్మిస్తోంది. ఇందులో ఒకటి ఇప్పటికే పూర్తి కాగా.. రాకపోకలు జరుగుతున్నాయి. రెండో వంతెన నిర్మాణ దశలో ఉండగా.. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో వరద పోటెత్తడంతో దాని పిల్లర్లు నెలకొరిగాయి. దీంతో బ్రిడ్జి దెబ్బతింది. నాణ్యతా లోపాల వల్లే బ్రిడ్జి కూలిందన్న విమర్శలు ఉన్నాయి.