పంజాబ్ మాదిరిగా తెలంగాణలోనూ మొత్తం ధాన్యం కొనుగోలు చేయాలనే డిమాండ్ తో మంత్రుల బృందం ఢిల్లీ వెళ్లింది. గురువారం కేంద్రమంత్రి పీయూష్ గోయల్ అపాయింట్ కూడా కోరింది. అయితే.. వారితో భేటీకి ముందే కొనుగోళ్లపై క్లారిటీ ఇచ్చేశారు పీయూష్ గోయల్.
లోక్ సభలో ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి మాట్లాడారు పీయూష్. తెలంగాణలో ఉత్పత్తి అయిన మొత్తం ధాన్యం, బియ్యాన్ని కొనడం కుదరదని తేల్చిచెప్పారు. అదనంగా ఉన్న ఉత్పత్తుల డిమాండ్, సరఫరా పరిస్థితుల ఆధారంగానే కొనుగోళ్లు ఉంటాయని స్పష్టం చేశారు.
అంతకుముందు రాజ్యసభ లాబీలో పీయూష్ ను టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు కలిశారు. కేశవరావు నేతృత్వంలో కలిసిన ఎంపీలు.. ధాన్యం సేకరణ అంశాన్ని ప్రస్తావించారు. దీనిపై చర్చించేందుకు మంత్రుల బృందం ఢిల్లీ వచ్చిందని అపాయింట్ మెంట్ ఇవ్వాలని కోరారు.
వన్ నేషన్–వన్ ప్రొక్యూర్ మెంట్ నినాదంతో ఢిల్లీ వెళ్లింది మంత్రుల బృందం. ఇదే సమయంలో పీయూష్ లోక్ సభలో కొనుగోళ్లపై మాట్లాడడంతో ఆసక్తికరంగా మారింది. దీనిపై ఇప్పటికే చాలా సార్లు వివరణ ఇచ్చింది కేంద్రం. ఈసారి యాసంగిలో కూడా తెలంగాణ నుండి రా రైస్ కొనుగోలు చేస్తామని స్పష్టం చేసింది. కానీ.. ధాన్యమే తీసుకోవాలని కేసీఆర్ పట్టుపట్టి కూర్చున్నారు. మేం ధాన్యమే ఇస్తాం.. మీరు దాన్ని ఏదైనా చేసుకోండని చెబుతున్నారు. ఈ క్రమంలో మంతృల బృందం ఢిల్లీ వెళ్లింది.