ప్రపంచంలో టమాటోని కొట్టే వెజిటేబుల్ ఉండదేమో..! ఉప్పులేని వంటకం ఎలా చప్పగా ఉంటుందో టమాటో వేయని ఐటమ్ రుచీ ఉండదు..అభిరుచికి అందమూ రాదు. టమాటో వేస్తే ఆ టేస్టే వేరు.ఇక పిజ్జా విషయానికి వస్తే.. టమాటో లేని పిజ్జాని ఊహించుకోవడమే కష్టం. పిజ్జాలేనిదే పొద్దుగడవని బ్రిటన్ లో ఇప్పుడు టమాటో కరువొచ్చింది.
పాపం, బ్రిటన్ ప్రజలు ఇప్పుడు టమాటో లేకుండానే పిజ్జా తినాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే.. అక్కడ టమాటో ధరలకు రెక్కలొచ్చేశాయి. గతేడాది కేవలం 5 పౌండ్లు ఉన్న కిలో టమాటో ధర.. ఇప్పుడు 20 పౌండ్లకు (ఇండియన్ కరెన్సీలో రూ.1986)కి చేరింది.
కొన్ని చోట్ల 30 పౌండ్ల (రూ.2979)కు అమ్ముతున్నారు. ఇలా టమాటో ధరలు విపరీతంగా పెరిగిపోవడం వల్ల, సూపర్ మార్కెట్లలో టమాటో కొరత ఏర్పడింది. ముఖ్యంగా.. పిజ్జా మార్కెట్‌పై భారీ ఎఫెక్ట్ పడింది.
పిజ్జా, పాస్తా, సాస్ తయారీలో టమాటో వినియోగిస్తారన్న విషయం తెలిసిందే! ఇప్పుడు టమాటో ధరలు గణనీయంగా పెరగడంతో.. వ్యాపారులు పిజ్జా ధరల్ని అమాంతం పెంచేశారు.
కొందరు.. టమాటో -ఫ్రీ (టమాటో లేని) పిజ్జాలను విక్రయిస్తున్నారు. కొన్ని రెస్టారెంట్లైతే తాత్కాలికంగా మూతపడ్డాయి కూడా! ఒక్క బ్రిటన్‌లోనే కాదు.. ఇటలీలోనూ ఇలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి.
ఈ టమాటో ధరలు పెరగడంపై ఇటాలియన్ చెఫ్స్ అసోసియేషన్ FIC అధ్యక్షుడు ఎంజో ఒలివేరి మాట్లాడుతూ.. ప్రతీ చోటా టమాటో షార్టేజ్ ఉందని, ఎక్కడి నుంచి టమాటో లు సరఫరా అవ్వడం లేదని అన్నారు.
కొన్ని రెస్టారెంట్లైతే టమాటో -లెస్ పిజ్జాలను అందిస్తుండటంతో పాటు కొన్ని వంటకాల్ని పూర్తిగా ‘మెను’ నుంచి తీసేశాయని తెలిపారు. టమాటో ధరలు భారీగా పెరగడం వల్ల.. వైట్ పిజ్జాల, వైట్ సాస్, టమాటో -లెస్ పిజ్జాల ట్రెండ్‌ని మొదలుపెట్టాల్సి వచ్చిందన్నారు.
బ్రిటన్‌కు స్పెయిన్, నార్త్ అమెరికాల నుంచి శీతాకాలపు నెలల్లో దాదాపు 95% టమాటోలు సరఫరా అవుతుంటాయి. అయితే.. ఇప్పుడు ఆ రెండు ప్రాంతాల్లో వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేవు. స్పెయిన్‌లో పరిమితికి మించి చలి ఉండగా, మొరాకోలో వరదల కారణంగా పంట దిగుబడులు దెబ్బతిన్నాయి.
దీంతో ఆయా దేశాలు ఎగుమతుల్ని నిలిపివేశాయి. అటు.. అధిక విద్యుత్ టారిఫ్‌లు బ్రిటన్, నెదర్లాండ్స్‌లోని గ్రీన్‌హౌస్‌లలో పండించే ఉత్పత్తుల సరఫరాపై కూడా ప్రభావం చూపాయి. ద్రవ్యోల్బణం, లాజిస్టిక్ సమస్యలు, బ్రెక్సిట్ వంటి అంశాల కారణంగా.. ఇటాలియన్ రెస్టారెంట్‌లకు కష్టకాలం ఎదురైంది.