అగ్నిపథ్ ను రద్దు చేసే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తోందని తేల్చి చెప్పారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. గురువారం గాంధీభవన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సందర్భంగా దివంగత నేత పీజేఎస్ కుమార్తె, టీఆర్ఎస్ కార్పొరేటర్ విజయారెడ్డికి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో కలిపి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. ఈ నెల 27 న రాష్ట్రంలోని ప్రతీ నియోజకవర్గ కేంద్రంలో ర్యాలీలు నిర్వహించాలని పిలుపునిచ్చారు రేవంత్ రెడ్డి. శుక్రవారం చంచల్ గూడ జైలులో ఉన్న ఆర్మీ అభ్యర్ధులను పరామర్శించనున్నట్టు రేవంత్ తెలిపారు. ఆర్మీ అభ్యర్ధులకు లీగల్ గా సపోర్ట్ చేస్తామన్నారు.
టీఆర్ఎస్ పాలనలో రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే నగర రూపురేఖలు మారుస్తామన్నారు రేవంత్ రెడ్డి. ప్రజల కోసం సొంత పార్టీని కూడా నిలదీసిన మహోన్నత నేత పీజేఆర్ అని పేర్కొన్నారు.
తండ్రి ఆశయాల కోసమే విజయారెడ్డి కాంగ్రెస్ లో చేరుతుందని రేవంత్ తెలిపారు. వానాకాలం సీజన్ ప్రారంభమైనా.. ఇప్పటికీ రైతులకు పెట్టుబడి సాయం అందలేదని తెలిపారు. టీఆర్ఎస్ కు కాలం చెల్లే రోజు దగ్గరపడిందని అన్నారు.