– పీకే కాంగ్రెస్ లో చేరుతున్నారా..?
– బీజేపీని ఓడించేందుకు కంకణం కట్టుకున్నారా..?
– పార్టీ ముఖ్యనేతల సమావేశంలో పీకే
– పీకే సలహాలతో ముందుకెళ్లాలని నిర్ణయించిన అధిష్ఠానం
– సీనియర్ల అసమ్మతి
– కలిసి ఉంటే మంచిదంటున్న గాంధీలు
– కలిసి పని చేస్తే రాత మారుతోందంటున్న విశ్లేషకులు
– అధికారిక ప్రకటన కోసం ఎదురుచూస్తున్న నేతలు
దేశ రాజకీయాల్లో వ్యూహ కర్తగా పేరున్న వ్యక్తి ప్రశాంత్ కిశోర్. ఎన్నో అసాధ్యాలను సుసాధ్యాలుగా చేసి చూపించిన వ్యక్తి ఆయన. అయితే.. గెలుపుకోసం కుస్తీలు పడుతున్న ఎన్నో పార్టీలకు తాను ముందుండి మార్గదర్శకాలు చేసి నడిపించారు పీకే. ఈ నేపథ్యంలో పీకే కాంగ్రెస్ లో చేరుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే.. అస్తిత్వ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న కాంగ్రెస్ ను దారిన పెట్టేందుకు ఆయన కంకణం కట్టుకున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా నడుస్తోంది.
2014లో బీజేపీ కేంద్రంలో అధికారం చేపట్టిన నాటి నుంచి ఇటీవలి ఐదు రాష్ట్రాల ఎన్నికల వరకు దేశంలో జరిగిన 49 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ 39 ఎన్నికల్లో ఓటమి పాలైంది. అలాగే.. సార్వత్రిక ఎన్నికలలో కూడా హస్తం పార్టీ ప్రదర్శన అధ్వాన్నంగా తయారైంది. 2014లో 44 సీట్లు, 2019లో 52 స్థానాలు మాత్రమే గెలవటం ఆ పార్టీ దుస్థితికి నిదర్శనం. దేశంలోని మొత్తం 545 లోక్‌సభ స్థానాలలో దాదాపు 200 స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్ ల మధ్య ముఖాముఖి పోరు ఉంటోంది. వాటిలో బీజేపీని ధీటుగా ఎదుర్కోవటంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమవుతోంది.
కారణాలను విశ్లేషించుకుని పార్టీ తిరిగి పుంజుకునేలా చేసే ప్రయత్నంలో పార్టీ నాయకత్వం ఎన్నికల వేళ మాత్రమే హడావుడి చేసి.. మిగతా సమయంలో అటువైపు కూడా చూడదు. కానీ.. బీజేపీ నాయకత్వం నిరంతరం ఎన్నికల ఏర్పాట్లలో నిమగ్నమై.. ఎన్నికలకు చాలా కాలం ముందే వ్యూహ రచన చేసి దానిని అమలుచేసే పనిలో ఉంటోందని.. అందుకే బీజేపీ ముందు కాంగ్రెస్ తేలిపోతోందంటున్నారు విశ్లేషకులు. దీనికి తోడు పార్టీ బలహీనమయ్యే కొద్దీ అసమ్మతి స్వరం పెరగుతోంది. నిన్న మొన్నటి వరకు సోనియా దయతో అధికార పదువులు అనుభవింని వారు ఇప్పుడు ఆమె పట్ల ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. గాంధీల ప్రజాకర్షణ శక్తి తగ్గితే తగ్గ వచ్చు.. కానీ ఇప్పటికీ ఆ పార్టీ ముక్కలు కాకుండా ఈ మాత్రమైనా ఒక్కటిగా ఉందంటే గాంధీలే కారణం అంటున్నారు. అయితే.. అసమ్మతి నేతల వాదనను కూడా కొట్టిపారేయలేమనేది కొందరి వాదన.
ఇదిలా ఉంటే.. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ నివాసంలో శనివారం పార్టీ సీనియర్ నేతలు సమావేశమై నాలుగు గంటల పాటు చర్చించారు. రాహుల్ గాంధీతో పాటు అంబికా సోనీ, దిగ్విజయ్ సింగ్, మల్లిఖార్జున ఖర్గే, అజయ్ మాకెన్, కెసి.వేణుగోపాల్ తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా పాల్గొనడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే.. పీకే సొంత పార్టీ పెడతారనే ఊహాగానాల నడుమ.. ఆయన కాంగ్రెస్ లో చేరతారా, సలహాదారుగా ఉంటారా అనేది కూడా దేశ కాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. రాత్రికి రాత్రి కథ మారకపోవచ్చు కానీ.. జాతీయ స్థాయిలో బీజేపీకి ప్రత్యామ్నాయం కాగల సత్తా ఇప్పటికీ కాంగ్రెస్ కు మాత్రమే ఉందని పీకే బలంగా నమ్ముతారని ఆయన సన్నిహిత వర్గాలు చెప్తున్న మాట.
2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు కాంగ్రెస్, మోడీ, షా ఇలాఖా గుజరాత్ పై కాంగ్రెస్ గురిపెట్టినట్టు తెలుస్తోంది. అందుకు ప్రశాంత్ కిశోర్ సేవలను పూర్తిగా వినియోగించుకోనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్‌కు పోటీగా గుజరాత్ లో ఆప్ పాగా వేసే ప్రయత్నంలో ఉన్నట్టు తెలుస్తోంది. అక్కడి పీసీసీ వర్కింగ్ ప్రెసిండెంట్, బలమైన పటీదార్ సామాజికవర్గానికి చెందిన యువనేత హార్దిక్ పటేల్ ను తమ వైపు తిప్పుకోవాలని ఆప్ ప్రయత్నిస్తోందనే వార్తలు జోరందుకున్నాయి. అయితే.. హార్దిక్ పటేల్‌తో పాటు రాష్ట్రానికి చెందిన దళిత నేత జిగ్నేష్ మేవాని వంటి యువనేతలు గుజరాత్ కాంగ్రెస్‌లో ఉండటం పార్టీకి బలం చేకూరే అంశమే అయినప్పటికీ.. 2017 ఎన్నికలలో కాంగ్రెస్ 77 స్థానాలతో సరిపెట్టుకుంది. బీజేపీకి 49 శాతం ఓట్లు వస్తే కాంగ్రెస్ కు 41 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. కనుక ఈ ఏడాది జరిగే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలలో ప్రశాంత్ కిశోర్ వ్యూహాలతో బీజేపీకి షాక్ ఇవ్వాలని కాంగ్రెస్ ఉవ్విళ్లూరుతోందంటున్నారు పార్టీ పెద్దలు.
గత ఏడాది కాంగ్రెస్ అధిష్ఠానం, ప్రశాంత్ కిశోర్ మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. ఆ తర్వాత కిశోర్ కాంగ్రెస్, రాహుల్ గాంధీపై బహిరంగంగానే విమర్శలు గుప్పించారు. అయితే.. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘోర ఓటమి తర్వాత.. మరోసారి వారు పీకేతో కలిసి పనిచేసేందుకు ముందుకు వచ్చారని.. అందుకు పార్టీలో కీలకంగా వ్యవహరించేందుకు ప్రశాంత్ కూడా ఇంట్రెస్ట్ గా ఉన్నట్టు తెలుస్తోంది. పీకే పార్టీలోకి రావటం పట్ల కొందరు సీనియర్లు అయిష్టత ప్రదర్శించినప్పటికీ.. పీకే వ్యవహార శైలి సీనియర్లను ఇబ్బంది పెట్టేలా ఉండకూడదని అధిష్టానం భావిస్తుందనేది పార్టీ వర్గాలు చెప్తున్నా మాట. మరి అందుకు ఆయన అంగీకరిస్తారో లేదో తెలియదు. కానీ స్వేచ్చ ఇస్తే కాంగ్రెస్ రాత మారే అవకాశం ఉందనటంలో సందేహం లేదంటున్నారు కొందరు రాజకీయ పండితులు. ఇప్పుడు గాంధీలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు.. పార్టీలో పీకే స్థానం ఏంటి అనేది అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడక తప్పదంటున్నారు.