– కాంగ్రెస్ లో చేరుతున్న పీకే!
– మూడురోజుల్లో ముహూర్తం ఖరారు
– టీఆర్ఎస్ కు పీకే హ్యాండ్ ఇచ్చినట్లే!
– రాహుల్ తో కీలక చర్చల తర్వాత నిర్ణయం
– మే మొదటివారంలో రాహుల్ తెలంగాణ టూర్
– కేసీఆర్ కు వ్యతిరేకంగా ప్రచారం!
– ఏడేళ్ల మిత్రత్వం ఇక శత్రుత్వమా?
– కేసీఆర్ ఆశలు గల్లంతేనా?
బంగారు భారత్ అంటూ దేశ రాజకీయాల్లో మార్పు తెస్తానని తిరుగుతున్న కేసీఆర్ కు ఇది పెద్ద షాకింగ్ వార్తే. ఎవరిని చూసుకుని ఆయన మోడీని చెడామడా తిట్టేశారో.. ఎవరిని చూసుకుని కేంద్రానికి అవినీతి మరకలు అంటించారో.. ఎవరిని చూసుకుని కాషాయ పార్టీని బంగాళాఖాతంలో కలిపేస్తానన్నారో.. చివరకు ఆయనే కేసీఆర్ ను నడి సంద్రంలో వదిలేసి పోతున్నారని అంటున్నారు రాజకీయ పండితులు. ఆయన ఎవరో కాదు. ఎడెనిమిదేళ్లుగా కేసీఆర్ తో స్నేహం చేస్తున్న ప్రశాంత్ కిషోర్.
దేశ రాజకీయాల్లో మార్పుల కోసం తాను ప్రశాంత్ కిషోర్ కలిసి పని చేస్తున్నానని కేసీఆర్ ఈమధ్యే ప్రకటించారు. దానికి తగ్గట్లుగా పీకే కూడా కొన్నాళ్లు హైదరాబాద్ లో మకాం వేసి.. కేసీఆర్ పాలనపై ప్రజల్లో ఉన్న అభిప్రాయాలను సేకరించారు. కొన్ని నివేదికలు అందజేశారు. అయితే.. సడెన్ గా పీకే తన మకాంను ఢిల్లీకి మారుస్తున్నారని అక్కడి నుంచి గుజరాత్ గాంధీనగర్ కు షిఫ్ట్ అయ్యేందుకు చూస్తున్నారని అంటున్నారు విశ్లేషకులు. గుజరాత్ లో కాంగ్రెస్ కు పని చేసేందుకు పీకే ఎంతో ఆసక్తి చూపిస్తున్నారని.. రేపో మాపో కాంగ్రెస్ గూటికి చేరుతారనే ప్రచారం ఊపందుకుంది. తెలంగాణలో టీఆర్ఎస్ కు పని చేస్తూ.. ఇతర రాష్ట్రాల్లో కాంగ్రెస్ కు ఎలా చేస్తారన్న అంశంపై భిన్న వాదనలు వినిపించడంతో ఆయన హస్తం పార్టీకే జై కొట్టారని చెబుతున్నారు విశ్లేషకులు.
రాహుల్ తో పీకే భేటీ తర్వాత రాజకీయ పరిణామాలు బాగా మారిపోయాయని అంచనా వేస్తున్నారు విశ్లేషకులు. ఇకపై కేసీఆర్ తో పీకే ప్రయాణం ముగిసినట్లేనని భావిస్తున్నారు. ఇదే గనక జరిగితే తెలంగాణ సీఎంకు మరింత గడ్డు కాలం తప్పదని అంటున్నారు. ఈ మధ్య కాలంలో పీకే మీదే ఆయన ఎక్కువగా ఆధారపడ్డారు. ఈ క్రమంలో ఆయన దూరం అయితే కేసీఆర్ కు ఇబ్బందికర పరిస్థితులు తప్పవని చెబుతున్నారు. అటు మే మొదటివారంలో రాహుల్ గాంధీ తెలంగాణకు వస్తున్నారని విశ్వసనీయ సమాచారం. ప్రస్తుతం దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి అవకాశాలు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. రేవంత్ పీసీసీ అధ్యక్షుడు అయ్యాక కార్యకర్తల్లో జోష్ పెరిగింది. ఆయనకు అధిష్టానం ఫుల్ పవర్స్ ఇస్తే అన్నీ సెట్ రైట్ అవుతాయనే వాదన ఉంది. ఈ పరిస్థితుల్లో రాహుల్ గాంధీ.. కేసీఆర్ కు వ్యతిరేకంగా మే నెల నుంచి ప్రచారం మొదలు పెడుతున్నట్లు తెలుస్తోంది.
Advertisements
తాజా రాజకీయ పరిస్థితులను బట్టి.. పీకేతో కేసీఆర్ కు ఉన్న ఏడేళ్ల మిత్రత్వం ఇకపై శత్రుత్వంగా మారుతుందని అంచనా వేస్తున్నారు విశ్లేషకులు. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ జాతీయ రాజకీయాల ఆశలు గల్లంతయ్యాయనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలకు ముందు పలువురు నేతలను కలిసిన కేసీఆర్.. ఆ తర్వాత సైలెంట్ అయ్యారు. కాంగ్రెస్ లేని కూటమి వేస్ట్ అని తేలడంతో పీకే ద్వారా రాహుల్ కు దగ్గర అవుతారని విశ్లేషకులు భావించారు. కానీ.. చివరకు ఆయనకే షాకిచ్చి పీకే ఢిల్లీ ఫ్లైట్ ఎక్కారని చెబుతున్నారు. మరోవైపు ఈ అనూహ్య పరిణామం కాంగ్రెస్ లోని సీనియర్లకు గట్టి ఎదురుదెబ్బేనని అంటున్నారు. ఎందుకంటే.. వారి వెనుక కేసీఆర్ ఉన్నారనే ఆరోపణలు ఉన్న నేపథ్యంలో రాహుల్ గాంధీ.. టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పోరాటం సాగిస్తే అప్పుడు ఏం చేయాలో తెలియక వారంతా ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని అంచనా వేస్తున్నారు విశ్లేషకులు.