మునుగోడులో టీఆర్ఎస్ అభ్యర్థి?
కర్నె ప్రభాకర్ కే అవకాశం దక్కేనా?
పీకే సర్వే ను కేసీఆర్ ఫాలో అవుతారా?
ప్రభాకర్ రెడ్డికి మరోసారి బరిలో నిలువనున్నారా?
తెలంగాణ రాజకీయం ఇప్పుడు మునుగోడు చుట్టూ తిరుగుతోంది. ప్రధాన పార్టీలన్నీ మునుగోడుపై ఫోకస్ పెంచాయి. ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడంతో మునుగోడు నియోజకవర్గానికి ఉపఎన్నిక అనివార్యమైంది. రాజగోపాల్ రెడ్డి బీజేపీ తరుపున బరిలో దిగడం దాదాపుగా ఖాయం అయినట్టే కనిపిస్తోంది. అటు టీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ ప్రస్తుతం గెలుపు గుర్రాల వేటలో ఉన్నాయి. గతంలో ఇక్కడ ఒకే ఒక్కసారి గెలిచిన టీఆర్ఎస్.. ఉపఎన్నికతో అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చూస్తోంది. నియోజకవర్గంలో పరిస్థితులు, సామాజిక సమీకరణాలను పరిగణలోకి తీసుకుని అభ్యర్థిని ఎంపిక చేసే యోచనలో ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా మునుగోడుపై పీకే టీమ్ నిర్వహించిన సర్వే రిపోర్ట్ సీఎం కేసీఆర్ చేతికి అందినట్లు తెలుస్తోంది.
ఇక స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు అందరిని తమ వైపుకు తిప్పుకునే వ్యూహానికి కేసీఆర్ తెర తీశారు. ఇక మునుగోడులో ఏ పార్టీ బలం ఎంత ఉంది ? టిఆర్ఎస్ కు గెలుపు అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి ? ఈ నియోజకవర్గంలో బలమైన నాయకులు ఎవరు ? ఇతర పార్టీల నుంచి ఎవరు అభ్యర్థులుగా పోటీ చేయబోతున్నారు ? వారిని ఎదుర్కోవాలంటే టీఆర్ఎస్ నుంచి ఎవరిని పోటీకి దింపాలి అనే అంశాలపై ప్రశాంత్ కిషోర్ కు చెందిన ఐ ప్యాక్ టీమ్ సర్వే నిర్వహిస్తున్నట్లు సమాచారం
పీకే టీమ్ సర్వేలో మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌ల పేర్లు ప్రధానంగా ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరిలో కర్నె ప్రభాకర్‌కే సానుకూలత ఎక్కువగా ఉందని రిపోర్టులో పేర్కొన్నట్లు ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో నియోజకవర్గంలో టీఆర్ఎస్ నేతల మధ్య నెలకొన్న విభేదాలు తొలగిపోయేందుకు తక్షణమే చర్యలు చేపట్టాల్సిందిగా సూచించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పీకే టీమ్ రిపోర్ట్‌ను కేసీఆర్ క్షుణ్ణంగా స్టడీ చేస్తున్నారని.. క్షేత్ర స్థాయి పరిస్థితులపై స్థానిక నేతల నుంచి కూడా రిపోర్టులు తెప్పించుకునే అవకాశం ఉందని చెబుతున్నారు.
సర్వే రిపోర్టుల సంగతెలా ఉన్నా టీఆర్ఎస్ ఆశావాహులంతా ఇప్పుడు మునుగోడు బైపోల్ టికెట్ కోసం గట్టిగానే ప్రయత్నాలు సాగిస్తున్నారు. 2014లో టీఆర్ఎస్ తరుపున మునుగోడు నుంచి గెలిచి, 2018లో ఓడిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి.. మరోసారి తనకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నట్లు తెలుస్తోంది. నల్గొండ టీఆర్ఎస్ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి తన సోదరుడు కంచర్ల కృష్ణారెడ్డికి అవకాశం ఇవ్వాలని కేసీఆర్‌ను కలిసి విజ్ఞప్తి చేసినట్లు చెబుతున్నారు. ఇక గ్రౌండ్ రియాలిటీని బట్టి, ఒకవేళ తనకు జనాదరణ ఉన్నట్లు సర్వేలో తేలితే అవకాశం కల్పించాలని కర్నె ప్రభాకర్ కోరుతున్నట్లు తెలుస్తోంది.
Advertisements
మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తదితరులు కూడా బైపోల్ టికెట్‌పై ఆశలు పెట్టుకున్నారనే ప్రచారం జరుగుతోంది. అంతిమ నిర్ణయం కేసీఆర్‌దే కాబట్టి ఆయన మదిలో ఏముందన్నది తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడక తప్పదు.