నిర్భయ కేసులో ఒకరైన వినయ్ శర్మ ఆత్మహత్య చేసుకోవడానికి యత్నించినట్టు తెలుస్తోంది. వినయ్ శర్మ ఉన్న బ్యారాక్‌లోనే తలను గోడకేసి బాదుకోవడంతో అప్రమత్తమైన జైలు అధికారులు అతని ప్రయత్నాన్ని ఆపినట్టు సమాచారం. మార్చి 3న నిర్భయ దోషులకు ఒకేసారి ఉరిశిక్షను విధించాలని ఢిల్లీ పాటియాలా కోర్టు తీర్పునిచ్చింది. ఉరిశిక్ష తేదీ ముంచుకొస్తోన్న క్రమంలో… ఉరి నుంచి తప్పించుకునేందుకుగాను వినయ్ శర్మ ఈవిధమైన ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నాడా అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి.సాధారణంగా ఉరిశిక్ష వేసే క్రమంలో జైలు అధికారులు దోషుల ఆరోగ్య పరిస్థితిని పరిగణనలోకి తీసుకుంటారు. వారికి ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తిన ఉరిశిక్షను వాయిదా వేస్తారు. రోజువారీగా దోషుల ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తారు. ఈ నేపథ్యంలోనే ఉరిశిక్షను మరింత ఆలస్యం చేసేందుకే వినయ్ శర్మ ఆత్మహత్యయత్నం చేసి ఉంటాడనే అనుమానాలు తలెత్తున్నాయి. వినయ్ శర్మ ఆత్మహత్యాయత్నం చేశాడనే వార్తలపై తీహార్ జైలు అధికారులు స్పందించలేదు. జైలులో జరుగుతున్న విషయాలను బయటకు పొక్కకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న… ఈ వార్తలు బయటకు రావడంపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. అయితే ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది.