విమానాన్ని పేల్చేస్తానంటూ ఓ మహిళా ప్యాసెంజర్ బెదిరించడంతో కోల్ కతా నుంచి ముంబై వెళ్లాల్సిన ఎయిర్ ఏసియా విమానం మధ్యలోనే వెనుదిరిగి కోల్ కతా ఎయిర్ పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్ కావాల్సి వచ్చింది.
శనివారం రాత్రి 9:57 గంటలకు కోల్ కతా టు ముంబై వెళ్లే ఎయిర్ ఏసియా ఫ్లయిట్ 15316 లో మోహిన్ మొండల్ (25) అనే ప్రయాణీకురాలు ఎక్కింది. ఫ్లయిట్ టేకాఫ్ అయిన గంట సేపటికి ఆమె కేబిన్ సిబ్బందికి ఒక నోట్ ఇచ్చి కెప్టెన్ కు ఇవ్వమని కోరింది. ఆ నోట్ లో ”నా శరీరం చుట్టూ బాంబులున్నవి…ఏ క్షణంలోనైనా వాటిని పేల్చుతాను” అని రాసి ఉంది. ఇది చూసి షాకైన ఫైలట్ బాంబు బెదిరింపు కారణంగా తిరిగి కోల్ కతా వస్తున్నానంటూ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ కు సమాచారమిచ్చారు. దీంతో రాత్రి 11 గంటల ప్రాంతంలో కోల్ కతా విమానాశ్రయంలో పుల్ ఎమర్జెన్సీ ప్రకటించి ఫ్లయిట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ కు ఫర్మిషన్ ఇచ్చారు. ఫ్లయిట్ ల్యాండింగ్ కాగానే 11:46 గంటలకు నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లారు. మోహిన్ మొండల్ ను అరెస్ట్ చేసి ఫ్లయిట్ ను పూర్తిగా తనిఖీ చేశారు. ఉత్తుత్తి బెదిరింపుగా గుర్తించి ఫ్లయిట్ ను తిరిగి ముంబై పంపించారు.