పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై దాడి జరిగింది. నందిగ్రామ్‌లో ఎన్నికల ప్రచారం చేస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. తాను కారు వద్ద నిలబడి ఉన్న సమయంలో.. నలుగురైదుగురు వ్యక్తులు ఉద్దేశ్యపూర్వకంగా తనను గట్టిగా తోసివేశారని, దీంతో తనకు కాలుకు గాయమైనట్టు మమతా బెనర్జీ చెప్పారు. ఈ సంఘటన వెనుక కచ్చితంగా కుట్ర దాగి ఉందని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. తనపై దాడి జరిగిన సమయంలో ఆప్రదేశంలో పోలీసులెవ్వరూ లేరని ఆమె ఆరోపించారు. దాడికి ముందు నాలుగైదు గంటల ముందు నుంచే పోలీసులు ఎవరూ తనకు దగ్గరగా కనిపించలేదని ఆమె చెప్పారు ఈ ఘటనపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తానని ఆమె తెలిపారు. కాగా గాయపడిన మమత బెనర్జీని చికిత్స కోసం తృణమూల్ కాంగ్రెస్ నేతలు వెంటనే కోల్‌కతాకు తరలించారు.
నామినేషన్ దాఖలు చేయడంతో పాటు, ప్రచారం నిర్వహించేందుకు మమతా బెనర్జీ కోల్‌కతా నుంచి నందిగ్రామ్ వచ్చారు. ఓ ఆలయంలో పూజల అనంతరం నామినేషన్ దాఖలు చేశారు. గురువారం వరకూ ఆమె నందిగ్రామ్ నియోజకవర్గంలోనే ఉండాల్సి ఉంది. కానీ దాడి కారణంగా అర్ధాంతరంగా తన పర్యటనను ముగించుకొని వెళ్లారు.
#WATCH:"Not even one Police official was present. 4-5 people intentionally manhandled me in presence of public. No local police present during program not even SP. It was definitely a conspiracy. There were no police officials for 4-5 hrs in such huge public gathering" says WB CM pic.twitter.com/wJ9FbL96nX
— ANI (@ANI) March 10, 2021
మమతా బెనర్జీ చేసిన ఆరోపణలపై కేంద్ర మంత్రి పియూష్ గోయల్ స్పందించారు. ఈ విషయంపై తానేం మాట్లాడబోనన్నారు. ఇలాంటి సంఘటనలను చాలా సార్లు కవర్ చేసి ఉంటారని.. విషయం ఏమిటో మీకు అర్థమయ్యే ఉంటుందని రిపోర్టర్లను ఉద్దేశించి అన్నారు. దీదీలో ఓటమి కలవరం మొదలైందని..ఇలాంటి మాటలు, చర్యలు ఓడిపోయే పార్టీ, ఓడిపోయే అభ్యర్థికి సంకేతాలని చెప్పారు. మమతా బెనర్జీ నందిగ్రామ్‌లో.. తృణమూల్ కాంగ్రెస్ పశ్చిమ బెంగాల్‌లో ఓడిపోవడం ఖాయమని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే మమతా బెనర్జీపై దాడికి సంంధించి తమకు ఫిర్యాదు అందినట్టు ఎన్నికల సంఘం తెలిపింది.