సాధారణంగా ఇంట్లో వాడుకునే ప్లాస్టిక్ బకెట్ ధర రూ. 150 నుంచి మొదలవుతుంది. ఎంత క్వాలిటీ ప్లాస్టిక్ బకెట్ అయినా.. ధర సుమారు వెయ్యి రూపాయలు దాటదు. కానీ.. అమెజాన్ వెబ్‌సైట్లో ఓ బకెట్‌ను రూ.35,900కు విక్రయిస్తుండటం జనాలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ బకెట్ వాస్తవ ధర రూ.35,900 కాగా.. 28 శాతం డిస్కౌంట్ పోగా.. రూ.25,999కే విక్రయిస్తుండటం చూసి ఓ వ్యక్తి షాకయ్యాడు.
అయితే.. సాంకేతిక సమస్య కారణంగా ఇలా వస్తోందా..? లేదంటే తప్పుడు ధర ఎంటర్ చేశారా? లేక.. హడావిడిగా షాపింగ్ చేసే వారు పొరపాటుగా ఒకటి, రెండు ఆర్డర్లు చేసినా బాగానే మిగులుతుందనే ఉద్దేశ్యంతో చేసి ఉండొచ్చా..? అని నెటిజన్లు తమలో తామే ప్రశ్నించుకుంటున్నారు.
ఇలా భారీ రేట్లతో నెట్ లో అప్ లోడ్ చేస్తే కొనేవారు పెద్దగా ఉండరు కదా.. దీని కారణంగా విక్రేతకు నష్టమే కదా..? అనే సందేహం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వింతలకు అమెజాన్ వేదికగా ఉందని చెప్పుకోవచ్చంటున్నారు కొందరు నెటిజన్లు. ఇప్పుడా బకెట్ ధరకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
అమెజాన్ లో బకెట్ ధర చూసి షాక్ అయిన వివేక్ రాజు అనే వ్యక్తి.. దాన్ని స్క్రీన్ షాట్ తీసి ట్విట్టర్ లో పోస్టు చేశాడు. దానికి ప్రశాంత్ యాదవ్ అనే ఓ నెటిజన్ స్పందిస్తూ మరో బకెట్ రూ.21,057కే వస్తోందని.. దీన్ని కొనుగోలు చేయండి అంటూ కామెంట్ చేశారు. అతని కామెంట్ కు స్పందించిన మరో నెటిజన్.. ఈ బకెట్ కొనుగోలు చేయాలంటే కిడ్నీ అమ్ముకోవాల్సిందే అంటూ రిప్లే ఇచ్చారు.
ఇంకొందరు నెటిజన్లు ఈ బకెట్ ఈఎంఐ ఆప్షన్ తో అందుబాటులో ఉంది కాబట్టి బతికిపోయాం అని జోకులు పేల్చుతున్నారు. అయితే.. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అమెజాన్ స్పందించింది. ‘అసౌకర్యానికి చింతిస్తున్నాం. దీనిపై మేం దృష్టి పెడతాం. మీరు చెప్తున్న వస్తువు లింక్ పెడతారా?’ అని అడిగింది.