రుతుస్రావం సమయంలో మహిళా ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవులు ఇచ్చే అంశంపై ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. ఇందుకు గల అవకాశాలను పరిశీలించాలని ఢిల్లీ ప్రభుత్వం అలాగే కేంద్రానికి సూచించింది. ఈ పిటిషన్‌ను వినతి పత్రంగా పరిగణించి, వీలైనంత త్వరగా పిటిషన్‌కు సమాధానం ఇవ్వాలని చీఫ్ జస్టిస్ డీఎన్ పటేల్, జస్టిస్ ప్రతీక్ జలాన్ నేతృత్వంలోని బెంచ్ ఆదేశించింది.
ఢిల్లీ లేబర్ యూనియన్ ఈ పిల్‌ను దాఖలు చేసింది. మహిళా ఉద్యోగులకు రుతుస్రావం సమయంలో ప్రత్యేక కాజువల్ లీవ్స్ లేదా పెయిడ్ లీవ్స్ మంజూరు చేయాలని కోరడంతో పాటు.. విధుల్లో ఉన్న సమయంలో వారికి ప్రత్యేక, పరిశుభ్రమైన టాయ్‌లెట్ రూం సదుపాయం కల్పించేలా ఆదేశించాలని విజ్ఞప్తి చేసింది. అలాగే ఉచితంగా శానిటరీ నాప్‌కిన్స్ అందజేయాలని కోరింది. దినసరి కూలీలు, కాంట్రాక్ట్, ఔట్‌సోర్స్ విధానాల్లో నియమితులైన అన్న తరగతుల మహిళా ఉద్యోగులకు ఈ అవకాశం కల్పించేలా ప్రభుత్వాలని ఆదేశించాలని కోరింది. పిటిషనర్ వాదనలను పరిశీలించాలని.. ఢిల్లీ హైకోర్టు ఈ మేరకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు సూచించింది.