సుమీలో చిక్కుకున్న భారతీయ విద్యార్థుల కోసం ఏర్పాటు చేస్తామన్న సురక్షిత కారిడార్(మానవతా కారిడార్) కార్యరూపం దాల్చలేదని భద్రతా మండలి సమావేశంలో భారత్ తెలిపింది.
భద్రతా మండలి సమావేశంలో భారత రాయబారి తిరుమూర్తి మంగళవారం మాట్లాడారు. ఉక్రెయిన్ లో నెలకొన్న పరిస్థితులపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఉక్రెయిన్ పరిస్థితులపై తక్షణ శ్రద్ధ అవసరమని పేర్కొన్నారు.
ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయులు సహా ఇతర దేశాల పౌరులందరి కోసం తక్షణమే సురక్షితమైన, ఎలాంటి అంతరాయం లేని సేఫ్ కారిడార్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
భారత్ అభ్యర్థనల మేరకు సేఫ్ కారిడార్ ను ఏర్పాటు చేసేందుకు ఉక్రెయిన్, రష్యాలు అంగీకరించాయని, కానీ అది ఇప్పుటి వరకు కార్యరూపం దాల్చలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఇరు దేశాల మధ్య అన్ని ప్రతికూలతలకు వెంటనే ముగింపు పలకాలని భారత్ కోరుకుంటోందని తెలిపారు. ఇరు దేశాల అధ్యక్షులకు ప్రధాని మోడీ ఇప్పటికే ఫోన్ చేశారని, చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని వారికి సూచించినట్టు ఆయన పేర్కొన్నారు.