ప్రియుడితో కలిసి సొంత కుటుంబ సభ్యులను హతమార్చిన కేసులో ఉరి శిక్ష ఖరారైన యూపీ మహిళ షబ్నమ్ ఉరితీతకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే షబ్నమ్‌కు గవర్నర్ అనందిబెన్ పటేల్ క్షమాభిక్షను తిరస్కరించారు. నిన్న మరోసారి గవర్నర్ వద్దకు ఆమె క్షమాబిక్ష పిటిషన్ వచ్చింది. అయితే ఇంకా దీనిపై నిర్ణయం వెలువడలేదు. ఇదిలా ఉండగానే.. షబ్నమ్ కుమారుడు మహ్మద్ కూడా తన తల్లిని క్షమించాలని కోరుతూ.. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ వద్ద క్షమాభిక్ష పిటిషన్ దాఖలు చేశాడు. దీంతో అటు గవర్నర్, ఇటు రాష్ట్రపతి ఆయా పిటిషన్లపై తీసుకునే నిర్ణయాలపై ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది. ఆ రెండు క్షమాభిక్ష పటిషన్లను వారు తిరస్కరిస్తే.. షబ్నమ్‌ను ఉరితీయడం ఖాయం.
షబ్నమ్‌ను ఉరి తీసేందుకు మథుర జైలు అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. నిర్భయ నిందితులను ఉరి వేసిన పవన్ జల్లాదే షబ్నమ్‌కు కూడా ఉరిశిక్ష అమలు చేసే అవకాశముంది. ఇదిలా ఉంటే రాష్ట్రపతి ఎదుట క్షమాబిక్ష పిటిషన్ దాఖలు చేసిన మహ్మద్.. షబ్నమ్‌కు జైలులోనే జన్మించాడు. కుటుంబ సభ్యులను హత్యలు చేసే సమయానికి ఆమె గర్భవతిగా ఉంది. ప్రస్తుతం మహ్మద్.. షబ్నమ్ మిత్రుడి వద్ద పెరుగుతున్నాడు.